నామస్మరణ మార్మోగింది.. లష్కర్ జనసంద్రమైంది.. అమ్మను దర్శించుకొని భక్త జనం పులకించింది. సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి బోనాల ఉత్సవాలు ఆదివారం కమనీయంగా సాగాయి. తెల్లవారుజామున 4 గంటలకు అమ్మవారికి మహా మంగళహారతి ఇవ్వగా, మంత్రి తలసాని కుటుంబసభ్యులు తొలిబోనం సమర్పించారు. అనంతరం భక్తుల రాక ప్రారంభమై,మధ్యాహ్నం వరకు క్యూలైన్లన్నీ రద్దీగా మారాయి. రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అమ్మవారికి పట్టువస్ర్తాలు సమర్పించారు. ఎమ్మెల్సీ కవిత బంగారు బోనం సమర్పించి మొక్కులు చెల్లించారు. గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, మంత్రులు మహమూద్‌అలీ, మల్లారెడ్డి, మేయర్ విజయలక్ష్మి, నగర సీపీ ఆనంద్, ఇతర ప్రముఖులు జగన్మాతను దర్శించుకున్నారు.
సిటీబ్యూరో, జూలై 17 (నమస్తే తెలంగాణ): లష్కర్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల సంబురం అంగరంగ వైభవంగా ఆదివారం వేకువజాము నుంచి షురువైంది. తల్లి బైలెల్లినాదో.. నాయనో.. అమ్మా బైలెల్లినాదో.. అంటూ పోతరాజులు, శివసత్తుల నృత్యాలతో అమ్మవారి భక్తులు సందడిగా బోనాలతో సికింద్రాబాద్‌లోని అమ్మవారి ఆలయానికి తరలివచ్చారు. తెల్లవారుజామున 4 గంటలకు అమ్మవారికి మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ కుటుంబసమేతంగా తొలిపూజ నిర్వహించారు. అనంతరం భక్తుల దర్శనానికి అనుమతినిచ్చారు.
రెండేండ్ల తర్వాత…
ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలకు రెండేండ్ల తర్వాత భక్తులను పూర్తిస్థాయిలో అనుమతించారు. తెల్లవారుజాము నుంచే భక్తులు మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. బోనాల వేడుక ఘటోత్సవంతో మొదలైంది. తెల్లవారుజాము 4 గంటలకు అమ్మవారికి మహాహారతి, కుంకుమ, పుష్పార్చనలు నిర్వహించారు. అమ్మవారికి సాకలు సమర్పించారు. ఉదయం నుంచే అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తడంతో కొవిడ్ నిబంధనలు పాటిస్తూ దర్శనం చేసుకోవాలని అధికారులు సూచించారు. కాగా అమ్మవారికి ఆలయ కమిటీ ప్రత్యేక పూజలు నిర్వహించింది. ఆలయ పరిసరాల్లో 200సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. 2500 మంది పోలీసులతో భద్రత ఏర్పాట్లు చేశారు.
ఆరు క్యూలైన్లు…
బోనాలతో వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా 6 క్యూలైన్లు ఏర్పాటు చేశారు. పాత రాంగోపాల్‌పేట్ పోలీస్‌స్టేషన్ వైపు నుంచి సాధారణ భక్తులు, వీఐపీ పాస్‌లతో వచ్చే వారిని, బోనాలతో వచ్చే వారిని కూడా ఇకడి నుంచి అనుమతిచ్చారు. బోనాలతో వచ్చే మహిళల కోసం బాటా నుంచి ఒక క్యూలైన్. టొబాకో బజార్ నుంచి దాతల కోసం, అంజలీ థియేటర్ నుంచి వీఐపీ, సాధారణ భక్తుల కోసం ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు.
అమ్మవారిని దర్శించుకున్న తర్వాత భక్తులు బయటకు వెళ్లేందుకు కొత్తగా రెండు నిష్రమణ గేట్లను ఏర్పాటు చేశారు. గతంలో దేవాలయం వెనుక వైపు కేవలం ఒకటి మాత్రమే ఉండగా ఈసారి అదనంగా ఆలయానికి దక్షిణం వైపు మరో రెండు గేట్లు ఏర్పాటు చేశారు. దీంతో భక్తులు అమ్మవారిని దర్శించుకున్న తర్వాత వెంటనే బయటకు వెళ్లిపోయేలా అధికారులు చర్యలు తీసుకున్నారు.
అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖులు..
మొదటి రోజు ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని ప్రముఖులు దర్శించుకున్నారు. కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి, హోంమంత్రి మహుమూద్ అలీ, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలతశోభన్‌రెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ సునితాలక్ష్మారెడ్డి, ఎమ్మెల్యేలు ముఠాగోపాల్, బేతి సుభాష్‌రెడ్డి, ఎంపీ మాలోతు కవిత, హైకోర్టు జడ్జి నంద, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్‌కుమార్, నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్, బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నాగేశ్, టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, ఫుడ్స్ చైర్మన్ మేడే రాజీవ్‌సాగర్, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ, తలసాని సాయికిరణ్ యాదవ్, కాంగ్రెస్ నేతలు రేవంత్‌రెడ్డి, మణికం ఠాగూర్, మాజీ మంత్రి గీతారెడ్డి, అంజన్‌కుమార్‌యాదవ్, మరి శశిధర్‌రెడ్డి, వీ హనుమంతరావు, బీజేపీ నేతలు ఈటల రాజేందర్, డీకే అరుణ, ఏనుగు రవీందర్‌రెడ్డి, ప్రముఖ గాయకురాలు మంగ్లీ, ప్రముఖ నిర్మాత బండ్ల గణేశ్ తదితరులు ఉన్నారు.
అమ్మవారికి బంగారు బోనం
సమర్పించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
సిటీబ్యూరో, జూలై 17 (నమస్తే తెలంగాణ): ఉజ్జయినీ మహంకాళి బోనాల సందర్భంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆదివారం అమ్మవారికి మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఆధ్వర్యంలో బంగారు బోనం సమర్పించారు. మోండా మారెట్ డివిజన్ ఆదయ్యనగర్ కమాన్ నుంచి ఎమ్మెల్సీ కవిత బంగారు బోనం ఎత్తుకొని మంత్రి తలసాని దంపతులతో కలిసి అమ్మవారికి సమర్పించి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి, డిప్యూటీ మేయర్ శ్రీలతశోభన్‌రెడ్డి, కార్పొరేటర్ మహేశ్వరి, మాజీ కార్పొరేటర్లు అత్తిలి అరుణగౌడ్, నామన శేషుకుమారి, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్చార్జి తలసాని సాయికిరణ్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
బోనమెత్తిన లష్కర్
బేగంపేట్, జూలై 17 : సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల పండుగను పురస్కరించుకుని ఆదివారం లష్కర్లో ప్రాంతాలన్నీ అమ్మవారి నామ స్మరణలతో మారుమ్రోగాయి. సికింద్రాబాద్ ప్రధాన రహదారులైన మహాత్మాగాంధీ రోడ్, రాష్ట్రపతి రోడ్, సరోజినీదేవి, నల్లగుట్ట, పార్కులైన్, కళాసీగూడ, పీజీ రోడ్, రాణిగంజ్, బన్సీలాల్‌పేట్, సెకండ్ బజార్, రెజిమెంటల్‌బజార్ తదితర ప్రాంతాలలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.
ఆకట్టుకున్న తొట్టెల బండ్ల ఊరేగింపు.
బోనాల జాతరలో కీలకమైన ఫలహారపు, తొట్టెల ఊరేగింపు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. హుషారెత్తించే అమ్మవారి పాటలు, డప్పు చప్పుళ్ళు, బాజా భజంత్రీలతో పాటు పోతరాజుల విన్యాసాల నడుమ అమ్మవారిని తొట్టెలలో కూర్చోబెట్టి రహదారులలో ఊరేగిస్తూ మహంకాళి అమ్మవారి ఆలయానికి తీసుకువచ్చారు.
జనసంద్రం..
లష్కర్ బోనాలను పురస్కరించుకుని నగరంలోని వివిధ వర్గాల ప్రజలు సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి ఆలయానికి తరలివచ్చారు. భక్తులకు ప్రభుత్వం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. చిన్నారులు, పెద్దలు సందడి చేస్తూ జాతరలో పాల్గొన్నారు. లష్కర్‌లోని ప్రధాన, అంతర్గత రహదారులన్నీ జన సంద్రంగా మారాయి.