మన్సూరాబాద్, జూలై 16: చెట్టు కూలిన ఘటనలో సహారాస్టేట్స్కాలనీలో ఇటీవల ఒక మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ సంఘటనను సాకుగా చూపుతూ పచ్చని చెట్లతో ఆహ్లాదకరంగా ఉన్న కాలనీని ఎడారిగా మారుస్తున్నారు. ప్రమాదాలు జరుగకుండా ఉండేందుకే చెట్ల కొమ్మలను కొడుతున్నామని చెబుతూ.. చెట్ల ఆనవాళ్లు లేకుండా చేస్తున్నారని ఆగ్రహించిన కాలనీవాసులు అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. స్థానికుల ఫిర్యాదుతో కాలనీకి చేరుకున్న అటవీశాఖ అధికారులు చెట్లను పరిశీలించి కాలనీ మెయింటెనెన్స్ కమిటీకి రూ.5వేల జరిమానా విధించారు. ఈ సంఘటన మన్సూరాబాద్ డివిజన్ సహారాస్టేట్స్ గేటెడ్ కమ్యూనిటీలో చోటు చేసుకుంది. పర్యావరణ పరిరక్షణ కోసం ఒకవైపు ప్రభుత్వం మొక్కలను నాటి పచ్చదనాన్ని పెంపొందిస్తుంటే మరో వైపు కొందరు వ్యక్తులు చిన్నపాటి సంఘటనలను సాకుగా చూపుతూ కాలనీని ఎడారిగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా అటవీశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు.
చెట్లను నరికితే కఠిన చర్యలు తీసుకుంటాం
చెట్లను నరికిన ఘటనలో సహారా మెయింటెనెన్స్ కమిటీకి రూ.5వేల జరిమానా విధించినట్లు శంషాబాద్ ఫారెస్ట్ డివిజన్ ఆఫీసర్ విజయానంద్ రావు తెలిపారు. సహారాస్టేట్స్కాలనీలో చెట్లను నరుకుతున్నారని స్థానికులు ఫిర్యాదు మేరకు తమ సిబ్బంది అక్కడి చేరుకుని పరిశీలించడం జరిగిందని తెలిపారు. ప్రస్తుతం నరికిన ప్రతి చెట్టుకు రెండు చొప్పున వెంటనే నాటుతామని మెయింటెనెన్స్ కమిటీ వారు హామీనిచ్చారని తెలిపారు. మరోసారి చెట్లను నరికితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని ఆయన తెలిపారు. సహారాస్టేట్స్కాలనీతో పాటు ఇతర ప్రాంతాల్లో ఎక్కడైనా చెట్లను నరికితే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.