బడంగ్‌పేట, జూలై 11: నాలా పనులు పూర్తయితే భవిష్యత్‌లో ముంపు సమస్య ఉండదని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. మీర్‌పేట మున్సిల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీధర్కాలనీ, పాష్ కాలనీ, మంత్రాల చెరువు నుంచి వచ్చే వరద నీటిని మంత్రి పరిశీలించారు. కాలనీ వాసులను సమ్యలు అడిగి తెలుసుకున్నారు. పాష్ కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న మంత్రి క్యాంప్ కార్యాలయాన్ని పరిశీలించారు. నాలా పనులపై అధికారులతో చర్చించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రణాళికాబద్ధంగా పనులు చేయాలని అధికారులకు సూచించారు. నిరవధికంగా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చూడాలన్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ తగు సూచనలు చేశారన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి అధికారులు సిద్ధంగా ఉండాలన్నారు. రాష్ట్రం, జిల్లా కేంద్రాల్లో, సెక్రటేరియట్లో, మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాల్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
ప్రతి రోజూ అధికారులు, ప్రజాప్రతినిధుల పర్యవేక్షణ తప్పని సరిగా ఉండాలన్నారు. ఎస్ఎన్డీపీ, నాలా పనులు జరుగుతున్న ప్రదేశాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పనులు పూర్తయితే భవిష్యత్‌లో ఎలాంటి సమస్యలు రావన్నారు. మున్సిపల్ అధికారులు 24గంటలు ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. మూడు రోజుల పాటు విద్యార్థులకు సెలవులు ప్రకటించడం జరిగిందన్నారు. ఎలాంటి సమస్యలు వచ్చినా ప్రజలకు అండగా ఉంటామన్నారు. అవసరం అయితే తప్పా ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రావద్దన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ దుర్గా దీప్లాల్ చౌహాన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రంరెడ్డి, కమిషనర్ నాగేశ్వర్, గోపీనాథ్, అనురాధ, కార్పొరేటర్లు అర్కల భూపాల్ రెడ్డి, రవినాయక్, టీఆర్ఎస్ నాయకులు అర్కల కామేశ్‌రెడ్డి, దిండు భూపేశ్‌గౌడ్, రమేశ్, తదితరులు ఉన్నారు.
దళితుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి
కందుకూరు, జూలై 11: దళితుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. సోమవారం టీఎస్ ఎంఆర్పీఎస్ నియోజకవర్గం ఇన్చార్జి కందపెద్ద నర్సింహ, కడ్తాల జంగయ్య, ఎం.నర్సింహ మంత్రిని కలిసి సమస్యలను వివరిస్తూ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ దళితులను ఆదుకోవడానికి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నట్లు తెలిపారు. దళిత బంధు పథకం, డబుల్ బెడ్రూం ఇండ్లు అందరికీ వచ్చే విధంగా కృషి చేస్తానని చెప్పారు. తమ సమస్యల పరిష్కారం పట్ల మంత్రి సానుకూలంగా స్పందించడంతో ఎంఆర్పీఎస్ నాయకులు సంతోషం వ్యక్తం చేశారు.