సిటీబ్యూరో, జూలై 11 (నమస్తే తెలంగాణ) : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని డిగ్రీ కళాశాలల్లో ట్రెండింగ్లో ఉన్న బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ (బీబీఏ) కోర్సుకు మంచి డిమాండ్ కొనసాగుతున్నది. ఇంటర్మీడియట్ సెకండియర్ పూర్తి చేసిన యువతీ యువకుల్లో దాదాపు 30 శాతం బీబీఏ కళాశాలల్లో చేరుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. బీకామ్తో పోల్చితే గత విద్యా సంవత్సరం నుంచి బీబీఏ కోర్సులకు డిమాండ్ పెరుగుతున్నది. అందుకు మార్కెట్ పరిస్థితులే కారణమని ఓయూ ప్రొఫెసర్లు, ప్రైవేటు డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు అభిప్రాయపడుతున్నారు.
హైదరాబాద్ నగరంలో ఐటీ, ఉత్పాదక, సర్వీసు వంటి అనేక రంగాలకు సంబంధించిన కంపెనీలు విస్తరిస్తున్న నేపథ్యంలో మార్కెట్ రంగానికి కూడా మంచి డిమాండ్ పెరుగుతున్నది. ఈ క్రమంలో డిగ్రీలో బీబీఏ, పీజీ స్థాయిలో ఎంబీఏ వంటి కోర్సులు పూర్తి చేసిన యువతకు తప్పనిసరిగా ఉద్యోగాలు లభిస్తాయని అధ్యాపకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బీబీఏ కోర్సు వైపు యువత ఆసక్తి చూపుతున్నట్లు చెబుతున్నారు.
కొనసాగుతున్న ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ..
ప్రస్తుతం 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించిన డిగ్రీ అడ్మిషన్ల దరఖాస్తుల ప్రక్రియ ఆన్లైన్ సర్వీసెస్ ఆఫ్ తెలంగాణ (దోస్త్)ద్వారా నడుస్తున్నది. ఈ నెల 30 వరకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఉంటు ంది. ఈ నెల 6 నుంచి 30 వరకు కళాశాలలు, కోర్సుల ఎంపిక చేసుకునే వెబ్ ఆప్షన్ల ప్రక్రియ కొనసాగుతుంది. ఈ మేరకు తొలి దశ దోస్త్ కౌన్సెలింగ్, సీట్ల కేటాయింపును చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.