సిటీబ్యూరో, జూలై 11(నమస్తే తెలంగాణ) : విస్తారంగా కురుస్తున్న వర్షాలతో వరద ప్రభావిత ప్రాంతాలపై జీహెచ్ఎంసీ ప్రధానంగా దృష్టి సారించింది. ఇప్పటికే శిథిల భవనాలను కూల్చడం, కూలేందుకు సిద్ధంగా ఉన్న భవనాల నుంచి ప్రజలకు పునరావాస కేంద్రాలను తరలించారు. ఈ క్రమంలోనే వరద ప్రభావిత ప్రాంతాలను గుర్తించి సమస్యలు తలెత్తిన చోట వెంటనే పరిష్కార చర్యలు చేపడుతున్నారు. ఇందుకోసం 168 మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ (అత్యవసర బృందాలు) నిర్విరామంగా కృషి చేస్తున్నారు. వరదకు అడ్డుగా ఉన్న వ్యర్థాలను తొలగింపునకు 128 స్టాటిక్ బృందాలు, రహదారులపై నిలిచిన నీటిని వెంటనే క్లియర్ చేసేందుకు 128 మినీ మొబైల్ బృందాలు పనిచేస్తున్నాయి. ఇక డీఆర్ఎఫ్ బృందాలు అక్కడక్కడ విరిగిన పడిన చెట్లను తొలగిస్తున్నారు.
మూడు షిఫ్టుల్లో..
జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో 040- 21111111 నంబర్ హెల్ప్ లైన్ 24 గంటల పాటు మూడు షిఫ్ట్‌లో పని చేసే సిబ్బందినీ ఏర్పాటు చేశారు. ప్రజలు ఇబ్బందులు ఎదురైనా పక్షంలో హెల్ప్ లైన్‌ను సంప్రదిస్తే వెంటనే సహాయక చర్యలు అధికారులు తీసుకుంటారని మేయర్ తెలిపారు. లోతట్టు ప్రాంతాల్లో నీటిని తొలగించేందుకు 202 మోటార్లను ఏర్పాటు చేసినట్లు వివరించారు. గత సంవత్సరం అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని జీహెచ్ఎంసి ద్వారా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి తెలిపారు. కాగా కంట్రోల్ రూమ్‌కు సోమవారం సాయంత్రం వరకు 312 ఫిర్యాదులు రాగా అందులో 297 పరిషరించినట్లు, మిగిలిన 15 ఫిర్యాదులు ప్రాసెస్‌లో ఉన్నాయని తెలిపారు.