సిటీబ్యూరో, జూలై 11(నమస్తే తెలంగాణ): ‘డియర్ కస్టమర్.. మీ కరెంటు పవర్ ఈ రోజు రాత్రి 10.30 గంటలకు ఎలక్ట్రిసిటీ వారు డిస్కనెక్ట్ చేస్తారు.. ఎందుకంటే.. మీ గతనెల కరెంటు బిల్లు అప్డేట్ కాలేదు. దయచేసి వెంటనే మీరు మా విద్యుత్ అధికారిని ఈ నంబర్ (8972996339)లో సంప్రదించండి.. ధన్యవాదాలు.’…
ఈ మెసేజ్ చాలా మంది వినియోగదారులను గందరగోళానికి గురి చేస్తున్నది. దీంతో తమ ఇంటికి లేదా ఆఫీసులకు విద్యుత్ సరఫరా ఆగిపోతుందనే కంగారులో వెంటనే మెసేజ్‌లో ఉన్న ఫోన్ నంబర్‌కు కాల్ చేస్తున్నారు.
ఫోన్ చేయగానే ఎనిడెస్క్, క్విక్ సపోర్టు, జోహో అసిస్ట్ రిమోట్ యాప్‌లను డౌన్లోడ్ చేసుకోమని.. యాక్సిస్ కోడ్ చెప్పమని అడుగుతారు. ఇలా వివరాలు సేకరించిన సైబర్ నేరగాళ్లు వినియోగదారుల ఖాతాలను కొల్లగొడుతున్నారు. సైబర్ నేరగాళ్లు తెలివిగా డార్క్‌నెట్ నుంచి విద్యుత్ వినియోగదారుల డాటాను సేకరించి వాటి ద్వారా అమాయకులకు గాలం వేస్తున్నారని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో సైబర్ క్రైం పోలీసులు వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
బోల్తా పడకుండా ఉండాలంటే…
కరెంటు బిల్లు పేరుతో గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే మెసేజ్‌లు, ఫోన్లను నమ్మొద్దు. మీ డబ్బులు పోగొట్టుకోవద్దు.
మీ విద్యుత్ బిల్లు పై ఏదైనా అనుమానం ఉంటే సమీప విద్యుత్ అధికారి కార్యాలయానికి వెళ్లి తెలుసుకోండి.
గుర్తు తెలియని వ్యక్తులు పంపే మెసేజ్‌లు, వెబ్సైట్లలో మీ బ్యాంక్ వివరాలు ఇవ్వకండి. బ్యాంక్ వివరాలను అపరిచితులకు ఫోన్లో చెప్పకండి.
మీరు మోసపోయినట్లు గుర్తించ గానే 24 గంటలలోపు 1930…www.cybercrime.gov.in లో ఫిర్యాదు చేయండి.. అని పోలీసులు కోరుతున్నారు.
28 ఫిర్యాదులు.. రూ.10 లక్షలు లూటీ
హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ల పరిధిలో ఈ ఏడాది జనవరి నుంచి జూన్ 30 వరకు దాదాపు 28 ఫిర్యాదులు వచ్చాయి. ఫిర్యాదు దారులకు ఇదే విధంగా మెసేజ్‌లు పంపి.. రిమోట్ యాప్‌లను డౌన్లోడ్ చేయించి దాదాపు రూ. 10 లక్షలు వినియోగదారులు తేరుకునే లోపే కొట్టేశారు. ఇందులో హైదరాబాద్ -14 ఫిర్యాదుల్లో రూ. 4.85 లక్షలు, సైబరాబాద్-11 ఫిర్యాదుల్లో రూ.2.94 లక్షలు, రాచకొండ-3 ఫిర్యాదుల్లో రూ. 1.75 లక్షలను సైబర్ నేరగాళ్లు దోచుకున్నారు. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్‌కాల్, మెసేజ్‌ల సమాచారం నమ్మవద్దని సైబర్ క్రైమ్ పోలీసులు ప్రజలకు సూచిస్తున్నారు.
ఆ ఫోన్ కాల్స్‌ను నమ్మొద్దు టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ జి.రఘుమారెడ్డి
విద్యుత్ వాడకం బిల్లుల చెల్లింపు పేరుతో కొంత మంది వ్యక్తులు వినియోగదారులను మెసేజ్‌లు, ఫోన్ల ద్వారా సంప్రదిస్తున్నారు. ఇలాంటి వారిని నమ్మొద్దు. విద్యుత్ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని చెబుతున్నారు. వెంటనే బిల్లు చెల్లించకుంటే రాత్రిపూట విద్యుత్ సరఫరా నిలిపివేస్తామంటూ వినియోగదారులను బెదిరిస్తున్నారు. వినియోగదారుల బ్యాంకు అకౌంట్, డెబిట్ కార్డు వివరాలు తీసుకొని వారి అకౌంట్ల నుంచి నగదును విత్ డ్రా చేసుకుంటున్నారు.. అని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ దృష్టికి వచ్చింది. వినియోగదారులు తాము చెల్లించిన బిల్లుల వివరాలను సంస్థ వెబ్ సైట్ (www.tssouthernpower.com)లో, టీఎస్ఎస్పీడీసీఎల్ మొబైల్ యాప్‌లో సరి చూసుకోవాలి. సంస్థ రాత్రిపూట విద్యుత్ సరఫరా నిలిపివేయదు. ఎవరైనా విద్యుత్ బిల్లుల చెల్లింపుల కోసం బ్యాంకు అకౌంట్ వివరాలు అడిగితే, లింకులు పంపితే వాటిపై స్పందించకుండా వెంటనే పోలీసులకు, విద్యుత్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేయాలి.