సిటీబ్యూరో, జూలై 11(నమస్తే తెలంగాణ): రుణ యాప్ సంస్థలు బరితెగిస్తున్నాయి. మొన్నటివరకు దుర్భాషలాడుతూ హింసించిన ప్రతినిధులు మరింత నీచానికి ఒడిగడుతున్నారు. ఏకంగా మార్ఫింగ్‌తో నగ్న ఫొటోలను సృష్టించి, పక్కన రేపిస్ట్ అనే లోగోను పెట్టి, బాధితుడి సెల్ ఫోన్లో ఉన్న కాంటాక్టులన్నింటికీ పంపిస్తూ ఇజ్జత్ తీస్తున్నాయి. దీంతో బాధితులు తీవ్రమైన మనోవేదనకు గురవుతున్నారు. ఈ వేధింపుల నుంచి గట్టెక్కించాలంటూ బాధితులు పోలీసులను ఆశ్రయించి మొరపెట్టుకుంటున్నారు.
రెండో దఫాలో ముగ్గురు మృతి
2020లో హైదరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు లోన్‌యాప్‌లపై నమోదైన కేసులను సీరియస్‌గా తీసుకున్నారు. అదేసమయంలో చైనీయులతో పాటు ఢిల్లీ, బెంగళూరు, కోల్కత్త, హైదరాబాద్‌కు చెందిన 25 మంది కాల్‌సెంటర్ల నిర్వాహకులను అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి కొద్ది మేర తగ్గిన లోన్‌యాప్ వేధింపులు గత రెండు నెలలుగా తీవ్రమయ్యాయి. లోన్ తీసుకున్న వారితో పాటు తీసుకోని వారిని సైతం వదలడం లేదు. గతంలో రుణయాప్ సంస్థల వేధింపులు తాళలేక ఐదుగురు బలవన్మరణానికి పాల్పడగా, రెండో దఫాలో ఇప్పటి వరకు ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. అంతే కాకుండా అన్ని పోలీస్స్టేషన్ల పరిధిలో కేసులు నమోదవుతున్నాయి.
పరువు తీస్తున్న నిర్వాహకులు
రుణం తీసుకున్న వారినుంచి డబ్బులు వసూలు చేసేందుకు ఆయా సంస్థల నిర్వాహకులు అన్ని కోణాలను ఉపయోగిస్తున్నారు. ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసిన నగ్న ఫొటోలకు బాధితుల తలను అతికించి, రేపిస్టు అనే లోగోను యాడ్ చేసి బాధితుల కాంటాక్టు లిస్టులో ఉన్న వారికి పంపుతున్నారు. అంతటితో ఆగకుండా కాంట్రాక్టులో ఉన్న ఫొటోలకు బాధితుడి ఫొటోను సైతం యాడ్ చేసి నగ్న చిత్రాలను పంపిస్తూ పరువు తీస్తున్నారు. దీంతో బాధితుడితో పాటు కాంటాక్టు లిస్టులో ఉన్న వారి పరువుసైతం పోతుందంటూ పోలీసులను ఆశ్రయించి వాపోతున్నారు. దీనిపై సైబర్‌క్రైమ్ పోలీసులు ఆరా తీస్తున్నారు. సోమవారం ఈ వేధింపులకు సంబంధించి రెండు ఫిర్యాదు అందినట్లు పోలీసు అధికారులు పేర్కొన్నారు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరుపుతున్నామని సైబర్‌క్రైమ్స్ ఏసీపీ ఏవీఎం ప్రసాద్ తెలిపారు.
తల్లినే రేప్ చేశాడంటూ..!
సిటీబ్యూరో, జూలై 11(నమస్తే తెలంగాణ): రుణయాప్ సంస్థలు పూర్తిగా దిగజారాయి. వడ్డీ వసూలు చేసుకునేందుకు ఎంతకైనా తెగిస్తున్నాయి. రుణం కట్టనందుకు ఓ వ్యక్తికి చుక్కలు చూపించాయి. ‘కన్న తల్లిపై లైంగిక దాడికి పాల్పడ్డ కుమారుడంటూ’ ప్రచారం చేయడంతో బాధితుడు రాచకొండ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. వివరాల్లోకి వెళితే… బీబీనగర్ కొండమడుగు గ్రామానికి చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగి(25) రెండు నెలల కిందట క్యాష్ స్టార్ ఇన్స్టంట్ లోన్ యాప్ నుంచి రూ.3500 రుణం తీసుకున్నాడు.
ఆరు రోజుల తర్వాత తీసుకున్న రుణం చెల్లించాలని ఫోన్లు, మెసేజ్‌లు చేయడం మొదలు పెట్టారు. దీంతో తన దగ్గర ఇప్పుడు నగదు లేదని చెప్పడంతో వారు మరికొన్ని రుణ యాప్ సంస్థల పేర్లు చెప్పి వారి వద్ద తీసుకుని తమకు చెల్లించాలని పురమాయించారు. ఇలా ప్రైవేటు ఉద్యోగి ఈజీ లోన్, ఫోర్ట్రెస్ లోన్, అలెగ్జాండరియా లోన్, లోన్ బగ్ రుణ యాప్ సంస్థల నుంచి మొత్తం రూ.22 వేలు తీసుకున్నాడు. వెంటనే వాటిని చెల్లించాలని ఆయా రుణయాప్ సంస్థలు ఒత్తిడి పెంచాయి. కానీ అతడి వద్ద లేవని, కొంత సమయం కావాలని కోరినప్పటికీ అవేవి పట్టించుకోకుండా తప్పుడు ప్రచారానికి తెర లేపాయి.
ఎంత నీచంగా అంటే..!
రుణం తీసుకున్న ప్రైవేటు ఉద్యోగి పేరు పెట్టి ఇతను తన సొంత తల్లిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. వారి తల్లి వ్యక్తిగతంగా కూడా అంతా బూతు అంటూ అతడి కాంటాక్ట్స్‌లో ఉన్న అందరికీ ఫొటోలు, ఫోన్ నంబర్లను పంపించారు. ఇలా తీవ్ర వేధింపులకు గురిచేయడంతో ఆందోళనకు గురైన ప్రైవేటు ఉద్యోగి తనను కాపాడాలని రాచకొండ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.