ముషీరాబాద్/ కవాడిగూడ, జూలై 10 : బక్రీదు సందర్భంగా నియోజకవర్గంలో ముస్లింలు మసీదులకు పెద్ద సంఖ్యలో హాజరై ప్రార్థనలు చేశారు. భోలక్‌పూర్‌లోని బడీ మసీదులో ఉదయం 8 గంటలకు వందలాది మంది ముస్లింలు ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేతో పాటు టీఆర్ఎస్ నాయకుడు ముఠా జయసింహ హాజరై మసీదులో ముస్లింలను కలిసి ఆలింగనం చేసుకొని శుభాకాంక్షలు తెలిపారు. మసీదుల వద్ద ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జీహెచ్ఎంసీ అధికారులు అన్ని సౌకర్యాలను కల్పించారు. మాంసం వ్యర్థాలను విచ్చలవిడిగా పడేయకుండా ప్లాస్టిక్ సంచులను మసీదుల వద్ద అందుబాటులో ఉంచారు. మసీదుల వద్ద ఎలాంటి సంఘటనలు చోటుచేసుకోకుండా ఇన్స్పెక్టర్ జహంగీర్ యాదవ్ పోలీస్ బందోబస్తును నిర్వహించారు.
నియోజకవర్గంలోని వివిధ ప్రాం తాల్లో ఆదివారం బక్రీద్ పర్వదిన వేడుకలు ఘనంగా జరిగాయి. పలు మసీదులు, శ్మశాన వాటికలకు వేలాది మంది ముస్లింలు తరలివచ్చి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. రాంనగర్ డివిజన్ రిసాలలో జరిగిన బక్రీద్ వేడుకల్లో ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ పాల్గొని ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మైనారిటీ విభాగం నేతలు ముక్తార్ హుస్సేన్, అలందార్ హుస్సేన్, నాయకులు ముఠా జయసింహ, ఆర్ మోజస్, ముచ్చకుర్తి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.