శేరిలింగంపల్లి, జూలై 9: సాఫ్ట్వేర్ ఉద్యోగి నారాయణరెడ్డి హత్య కేసును సైబరాబాద్ పోలీసులు ఛేదించారు. తమ అంతస్తుకు తగినవాడు కాదని మామే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తేల్చారు. మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి శనివారం వివరాలు వెల్లడించారు. ప్రకాశం జిల్లా కొండపల్లి గ్రామానికి చెందిన శనివారపు వెంకట నారాయణ రెడ్డి(25) నగరంలోని ఓ సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. కేపీహెచ్‌బీ కాలనీలోని రోడ్ నంబర్ 1లో నివాసముంటున్నాడు. ఏడాది కిందట తన గ్రామానికి చెందిన వెంకటేశ్వరరెడ్డి కుమార్తె రవళిని ప్రేమించి పెండ్లి చేసుకొని..ఢిల్లీలో నివాసమున్నారు. వీరి పెండ్లి ఇష్టం లేని రవళి కుటుంబసభ్యులు తమ కూతురిని ఇంటికి పంపిస్తే పెద్దల సమక్షంలో వివాహం జరిపిస్తామని నమ్మించారు. వీరి మాటలు నమ్మి నారాయణరెడ్డి భార్య రవళిని పుట్టింటికి పంపించాడు. అయితే రవళిని వేరొకరితో పెండ్లి చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుసుకున్న నారాయణరెడ్డి ఆ సంబంధాలను చెడగొట్టాడు.
నారాయణరెడ్డి అడ్డు తొలగించుకుంటేనే రవళికి మరో పెండ్లి చేయడం సాధ్యమవుతుందని భావించిన ఆమె తండ్రి వెంకటేశ్వరరెడ్డి, అతడి కుమారుడు చంద్రశేఖర్‌రెడ్డి హత్యకు పథకం పన్నారు. బంధువు చైతన్యపురిలో ఉంటున్న శ్రీనివాస్‌రెడ్డి(20)కి రూ. 4.5 లక్షల సూపారీ ఇచ్చాడు. అడ్వాన్సుగా రూ.50 వేలు అందజేశాడు. శ్రీనివాస్‌రెడ్డి కాశీ, షేక్ ఆషీక్, శ్రీనులను కలుపుకొని హత్యకు ప్లాన్ వేశాడు. తనకున్న పరిచయంతో సొంత గ్రామానికి చెందిన వెంకట నారాయణరెడ్డిని జూన్ 26న కేపీహెచ్‌బీ కాలనీలోని రెడ్‌చిల్లీ రెస్టారెంట్‌కు పిలిపించాడు. కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి నారాయణ రెడ్డికి ఇవ్వగా, ఫోన్ కాల్ రావడంతో అతడు పని ఉందని చెప్పి వెళ్లిపోయాడు.
ఖాజగూడలో హత్య…జిన్నారంలో కాల్చివేత
మరుసటి రోజు జూన్ 27న పార్టీ చేసుకుందామని చెప్పి నారాయణ రెడ్డిని శ్రీనివాస్ రెడ్డి రాయదుర్గంకు పిలిపించాడు. పార్టీలో మందులో మత్తు ట్యాబెట్లు కలిపి ఇచ్చాడు. అర్ధరాత్రి 1:30 గంటల ప్రాంతంలో ఖాజగూడ చెరువు వద్ద కారు ముందు సీట్లో కుర్చున్న నారాయణరెడ్డి మెడకు టవల్, చార్జింగ్ కేబుల్‌ను చుట్టి నిందితులు హత్య చేశారు. సమీపంలోని బంక్‌లో పెట్రోల్ తీసుకొని నగర శివారు పరిధిలోని జిన్నారం అటవీ ప్రాంతానికి వెళ్లి అక్కడ నారాయణ రెడ్డి మృతదేహాన్ని పెట్రోల్ పోసి కాల్చివేశారు. తర్వాత నిందితులు కర్నూల్‌కు పరారయ్యారు. అషీక్ ఇచ్చిన సమాచారంతో శ్రీనివాస్ రెడ్డి, కాశీలను 4న కర్నూల్లో పోలీసులు పట్టుకున్నారు. అరెస్టుకు మందు శ్రీనివాస్ రెడ్డి, కాశీలు పురుగుల మందు తాగారు. చికిత్స చేయించిన పోలీసులు అనంతరం వారిని అరెస్టు చేశారు. వెంకటేశ్వర రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, శ్రీనులు పరారీలో ఉన్నారు.