సిటీబ్యూరో, జూలై 9 (నమస్తే తెలంగాణ): వర్షాల నేపథ్యంలో విద్యుత్ సరఫరాపై దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ అధికారులు క్షేత్ర స్థాయిలోని అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. శనివారం గ్రేటర్ పరిధిలోని 9 సర్కిళ్లతో పాటు ఇతర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా తీరుపై సీఎండీ జి.రఘుమారెడ్డి, డైరెక్టర్ ఆపరేషన్స్ జె.శ్రీనివాస్‌రెడ్డి, సీజీఎంలు, సూపరింటెండింగ్ ఇంజినీర్లతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎండీ రఘుమారెడ్డి మాట్లాడుతూ వానకాలం సీజన్ ముగిసే వరకు ప్రతి జిల్లా, సర్కిల్ కార్యాలయాల్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశామన్నారు. భారీ వర్షాలు కురిసే సమయంలో విద్యుత్ పర్యవేక్షణకు స్కాడాలో ప్రత్యేక కంట్రోల్ రూమ్, జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మరో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. 15 మంది నైపుణ్యం కలిగిన సిబ్బంది అందుబాటులో ఉండి విద్యుత్ సరఫరాను 24 గంటల పాటు పర్యవేక్షిస్తారని తెలిపారు.
వర్షాలు కురుస్తున్న సమయంలో ప్రజలు వైర్లను తాకరాదని, విద్యుత్ లైన్ల కింద, ట్రాన్స్ఫార్మర్ల వద్ద నిలబడరాదని సూచించారు. పశువులు, పెంపుడు జంతువులను విద్యుత్ పరికరాలకు దూరంగా ఉండేలా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. విద్యుత్‌కి సంబంధించి అత్యవసర పరిస్థితి ఉన్నా 1912/100/స్థానిక ఫ్యూజ్ ఆఫ్ కాల్ ఆఫీస్‌తో పాటు విద్యుత్ శాఖ ప్రత్యేక కంట్రోల్ రూమ్ నం.73820 72104, 73820 72106, 73820 71574కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు. వీటితో పాటు సంస్థ మొబైల్ యాప్, వెబ్సైట్, ట్విటర్,ఫేస్బుక్ మాధ్యమాల ద్వారా విద్యుత్ సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ రఘుమారెడ్డి తెలిపారు.