– సిటీబ్యూరో, జూలై 8 (నమస్తే తెలంగాణ): ఆలోచనలతో రండి.. ఆవిష్కరణలతో వెళ్లండి.. అంటూ స్వాగతం
పలుకుతున్నది టీ వర్క్స్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యువతను దృష్టిలో పెట్టుకొని ఐటీ కారిడార్‌లోని సాఫ్ట్వేర్ అప్లికేషన్లతయారీకి కేంద్రమైన టీ హబ్ పక్కనే సువిశాలమైన స్థలంలో ఏర్పాటు చేస్తున్న టీ వర్క్స్ హార్డ్‌వేర్ ఉత్పత్తుల తయారీకి కేంద్రంగా మారనున్నది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆవిష్కర్తల కలను సాకారం చేసేందుకు, సరికొత్త ఆలోచనలను పైసా ఖర్చు లేకుండా ఆవిష్కరించేందుకు ‘టీ వర్క్స్’ వచ్చే నెలలో ప్రారంభం కానున్నది.
యువత కలల సాకార సాధనకు ఊతమిచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సంకల్పించిన ప్రాజెక్టు టీ వర్క్స్. అత్యాధునిక టెక్నాలజీలో అద్భుతమైన ఆవిష్కరణలకు కేంద్రమైన టీ హబ్ తరహాలోనే, వినూత్న ఆలోచనలతో సమాజానికి ఉపయోగపడే పరికరాల నమూనాలను రూపొందించే కేంద్రంగా ఆరేండ్ల కిందట ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆలోచనలకు అనుగుణంగా బేగంపేటలో టీవర్క్స్‌ను ఏర్పాటు చేసింది. తాజాగా ఐటీ కారిడార్‌లోని టీ హబ్ పక్కనే సుమారు 4.92ఎకరాల స్థలంలో రూ.350 కోట్ల వ్యయంతో టీ వర్క్స్‌ను ఏర్పాటు చేస్తున్నది. మొదటి దశ నిర్మాణ పనులు దాదాపు పూర్తికాగా ఆగస్టు నెలాఖరులోగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మొదటి దశలో 78వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో వివిధ ఉత్పత్తులను తయారు చేసేందుకు రూ.2 కోట్ల విలువచేసే యంత్రాలను అందుబాటులో ఉంచారు. మూడు దశల్లో నిర్మించే టీవర్స్ భవనాన్ని 2లక్షల పైచిలుకు చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. అయితే టీవర్క్స్ కేంద్రం ప్రారంభం తర్వాత దేశంలోనే అతి పెద్ద ప్రొటోటైపింగ్ కేంద్రంగా మారనున్నది. ఇదిలా ఉండగా.. గ్రామీణ స్థాయిలో వినూత్న ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు రూరల్ ఇన్నోవేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రాం(ఆర్ఐడీపీ), హెల్త్ ఇన్నోవేషన్ డెవలప్ ప్రోగ్రాం (హెచ్ఐడీపీ)లను
చేపట్టారు.
తయారీ రంగానికి సంబంధించిన యంత్రాలు
టీ వర్స్‌లో లేజర్ కటింగ్ యంత్రం, మిల్లింగ్, డ్రిల్లింగ్, కటింగ్, పాటరీ, సెరామిక్, కార్పెంటరీ, 3డీ, ఎలక్ట్రికల్ టెస్టింగ్, ఎలక్ట్రో మెకానికల్ టెస్టింగ్ యంత్రం, పీసీబీల తయారీ యంత్రం, డిజైన్ ఇంజినీరింగ్ తదితర విభాగాలకు చెందిన అత్యంత ఖరీదైన యంత్రాలను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. ఒక్కో యంత్రం ఖరీదు రూ.2 కోట్ల వరకు ఉంటుంది. మొదటి దశలో రూ.50 కోట్ల విలువ చేసే యంత్రాలను ఏర్పాటు చేయగా.. మూడు దశల్లో కలిపి రూ.100 కోట్ల విలువ చేసే యంత్రాలను ప్రభుత్వమే ఏర్పాటు చేస్తున్నది. అయితే ఇక్కడకు వినూత్న ఆలోచనతో వచ్చి ఒక వస్తువుకు సంబంధించిన నమూనాను తయారు చేసుకునే వరకు ఉచితంగా అవకాశం కల్పిస్తారు.
ఎలక్ట్రిక్ కారును తయారు చేశా
టీవర్క్స్‌లో రకరకాల ఉత్పత్తులను తయారు చేసుకునేందుకు అవసరమైన యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. ఎలక్ట్రిక్ కారును తయారు చేశా. నాలో ఉన్న ప్రతిభను గుర్తించి కొత్త పరికరాలను తయారు చేసేందుకు టీవర్క్స్‌లో అవకాశం కల్పించారు. ఇక్కడ వెల్డింగ్, బెండింగ్, కటింగ్ యంత్రాలతో పాటు వస్తువుల తయారీకి అవసరమైన ముడి సరుకును అందిస్తున్నారు. ప్రోత్సాహం ఇలానే ఉంటే ప్రజలకు ఉపయోగపడే వస్తువులను తయారు చేసేందుకు అవకాశం ఉంటుంది.
– రాజేంద్ర ప్రసాద్,వరంగల్ జిల్లా.
కొత్త పరికరాన్ని తయారు చేస్తున్నా!
రైతులకు మార్కెట్లో దొరికే వ్యవసాయ పనిముట్లకు భిన్నంగా, పూర్తిగా కొత్త తరహాలో ఉండి, వ్యవసాయంలో ఉపయోగించే పరికరాలను తయారు చేయాలన్న ఆలోచన కలిగింది. నా ఆలోచనకు అనుగుణంగా సుమారు 8 రకాల ఉపకరణాలను తయారు చేశాను. మరింత మెరుగైన యంత్రాలను తయారు చేసేందుకు టీ వర్క్స్‌లో అవకాశం కల్పించారు. ైస్టెఫండ్ సైతం ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు. టీ వర్క్స్‌లో ఉన్న అత్యాధునిక యంత్రాలు, నిపుణుల సహకారంతో కొత్త పరికరాన్ని తయారు చేస్తున్నా.
– అశోక్, వ్యవసాయ ఉత్పత్తుల రూపకర్త, సూర్యాపేట జిల్లా