మియాపూర్, జూలై 8 : ఎలాంటి పరిస్థితులెదురైనా అభివృద్ధి విషయంలో వెనకడుగు వేయబోనని ప్రజలకిచ్చిన మాటను నిజం చేసేలా అభివృద్ధిలో ముందుకు సాగుతున్నట్లు విప్ అరెకపూడి గాంధీ అన్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీని తమ ప్రభుత్వం నెరవేరుస్తున్నదని, ప్రజా సౌకర్యమే తమకు అత్యంత ప్రధానమన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం హైదర్‌నగర్ డివిజన్ ఆదిత్యనగర్‌లో రూ. 88 లక్షలతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులకు కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావుతో కలిసి విప్ గాంధీ శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా విప్ గాంధీ మాట్లాడుతూ.. బడ్జెట్ లోటు.. కరోనా వంటి పరిస్థితులు ఎదురైనా ప్రజలకు మౌలిక వసతుల కల్పనలో ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తున్నదన్నారు. అన్ని కాలనీలలో సీసీ రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు సహా అన్ని మౌలిక వసతులను పూర్తి స్థాయిలో కల్పిస్తామన్నారు. కాలనీల అవసరాలను ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి నుంచి తెలుసుకుంటూ తగు నిధులు మంజూరుతో పనులతో సమర్థంగా ముందుకు సాగుతున్నామన్నారు.
అభివృద్ధి నిర్మాణ పనులను నాణ్యతతో సకాలంలో పూర్తి చేయాలని, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని గాంధీ పేర్కొన్నారు. ఆదర్శ నియోజకవర్గమే తన లక్ష్యమని, అందుకోసం పారదర్శకంగా చిత్తశుద్ధితో పని చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు దామోదర్‌రెడ్డి, రాజేందర్, వెంకటేశ్, సత్యనారాయణ, శ్రీకాంత్, శ్రీనివాస్, షరీఫ్, కలీం, రఘునాథ్‌రావు, డాక్టర్ సుబ్బారావు, కాలనీ ప్రతినిధులు పాల్గొన్నారు.
గురుకులాల్లో ఉత్తమ బోధన..
ఇటీవల విడుదలైన పది ఇంటర్ ఫలితాలలో శేరిలింగంపల్లి మండల మైనార్టీ గురుకుల పాఠశాల విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించిన తరుణంలో విప్ గాంధీని ఆయన నివాసంలో కలుసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను విప్ గాంధీ అభినందించారు. అనంతరం విప్ మాట్లాడుతూ.. మైనార్టీ గురుకుల పాఠశాలలు అనతికాలంలో ఎంతో ఖ్యాతిని గుర్తింపును గడించాయన్నారు. అత్యుత్తమ బోధన, నాణ్యమైన విద్యతో ఈ పాఠశాలలు ప్రతిభను కనబరుస్తుండటం అభినందనీయమన్నారు. మున్ముందూ విద్యార్థులు చదువులో రాణించి ఉత్తమ భవిష్యత్‌ను అందుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రఘునాథ్‌రెడ్డి, పాఠశాల ప్రిన్సిపాల్ చందర్‌రెడ్డి, ఇతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
పనులను పూర్తి చేసే బాధ్యత మాదే..
సిమెంటు ధరల పెంపు, వర్షాకాలం నేపథ్యంలో సీసీ రోడ్డు పనుల పూర్తిలో కొంత మేర ఆలస్యం జరిగిందని సీజన్ ముగుస్తూనే పనులన్నింటినీ పూర్తి చేసే బాధ్యత తమదేనని విప్ అరెకపూడి గాంధీ స్పష్టం చేశారు. తొలి మూడు నెలల పాటు యూజీడీ, తాగునీటి పైప్‌లైన్ తవ్వకాల వల్ల ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా తమ దృష్టికి గాని స్థానిక కార్పొరేటర్లు, అధికారుల దృష్టికి తీసుకురావాలని తక్షణ పరిష్కార చర్యలు చేపడతామని తెలిపారు. ఈమేరకు శుక్రవారం విప్ కార్యాలయం ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది. ప్రజల సౌకర్యం, అభివృద్ధే ధ్యేయంగా ముందుకు పోతున్న తమపై, తమ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నాన్ని కొందరు చేస్తున్నారని గాంధీ తెలిపారు. వాటిని ఏమాత్రం పరిగణలోని తీసుకోవాల్సిన అవసరం లేదని అనుక్షణం తాము ప్రజల వెంటే ఉండి సేవలను అందిస్తామని పేర్కొన్నారు.