కేపీహెచ్‌బీ కాలనీ, జూలై 7 : పర్యావరణ పరిరక్షణ కోసం సింగిల్‌యూజ్ ప్లాస్టిక్ వస్తువుల వాడకాన్ని నిషేధించడం జరిగిందని.. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలుంటాయని కూకట్పల్లి జోనల్ కమిషనర్ వి.మమత అన్నారు. గురువారం మూసాపేట సర్కిల్లోని పలు దుకాణాలలో ఆకస్మిక తనిఖీలు చేసి నిషేధిత సింగిల్‌యూజ్ ప్లాస్టిక్ వస్తువులు, 75 మైక్రాన్ల తక్కువ మందం కలిగిన ప్లాస్టిక్ కవర్లను స్వాధీనం చేసుకున్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సింగిల్‌యూజ్ ప్లాస్టిక్ వస్తువులపై నిషేధాన్ని విధించిందన్నారు. జూలై 1నుంచి ఈ నిషేధం అమల్లో ఉందని నిషేధిత వస్తువులైన ఈయర్ బర్డ్స్, ప్లాస్టిక్ స్టిక్స్, ప్లాస్టిక్ ప్లేట్లు, కప్పులు, ప్లాస్టిక్ గ్లాసులు, పోర్కులు, కత్తులు, స్పూన్లు, స్ట్రాలు, క్యాండీలను, ప్యాకేజింగ్ ఫిలిమ్స్, ప్లాస్టిక్ లేదా పీవీసీ బ్యానర్లు విక్రయించడం, ఉపయోగించడం నేరం అన్నారు. ఈ నిబంధనలు అతిక్రమిస్తే పర్యావరణ చట్టప్రకారం భారీ జరిమానాతో పాటు జైలుశిక్ష కూడా ఉంటుందని హెచ్చరించారు. నిషేధిత వస్తువులను విక్రయిస్తే వాణిజ్య లైసెన్స్ కూడా రద్దు చేయనున్నట్లు తెలిపారు. వ్యాపారులు నిషేధిత ప్లాస్టిక్ వస్తువులను అమ్మడం మానుకోవాలన్నారు. అలాగే ప్రజలు నిషేధిత ప్లాస్టిక్ వస్తువులను ఉపయోగించకూడదని కోరారు. కార్యక్రమంలో డీసీ రవికుమార్, ఎస్ఎస్ మురళీధర్ రెడ్డి తదితరులున్నారు.
వర్షపు నీటి కాలువల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని జడ్సీ మమత అన్నారు. గురువారం జోన్ పరిధిలోని ఐదు సర్కిళ్లలో ఎస్ఎన్డీపీ పనులపై అధికారులతో కలిసి జడ్సీ మమత సమీక్ష నిర్వహించారు. వర్షాకాలం నేపథ్యంలో నాలా అభివృద్ధి పనుల్లో ఇబ్బందులు లేకుండా చూడాలని.. ముంపు సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ పనులను త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎస్ఈ చిన్నారెడ్డి, ఈఈలు, డీఈలు, ఏఈలు, ఇరిగేషన్, ప్రాజెక్టు విభాగం అధికారులు పాల్గొన్నారు.
కేపీహెచ్‌బీ కాలనీ, జూలై 7 : టీఎస్‌బీపాస్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని కూకట్పల్లి జోనల్ కమిషనర్ వి.మమత అన్నారు. గురువారం కూకట్పల్లి జోన్ ఆఫీస్‌లో టౌన్‌ప్లానింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. టౌన్‌ప్లానింగ్ విభాగానికి వస్తున్న ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని.. కోర్టు కేసులపై దృష్టిని సారించాలని నిబంధనలకు విరుద్ధంగా చేపడుతున్న నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో సీపీ ఉమాదేవి, డీసీలు, టౌన్‌ప్లానింగ్ ఏసీపీలు, సెక్షన్ ఆఫీసర్లు, ఎన్ఫోర్స్మెంట్ విభాగం సిబ్బంది ఉన్నారు.