రాంనగర్‌కు చెందిన అశోక్ బైక్‌పై ఉప్పల్‌కు బయలుదేరాడు. ఓయూ సమీపంలోని జామై ఉస్మానియా బ్రిడ్జి వద్దకు వచ్చేసరికి ఫోన్ కాల్ రావడంతో లిఫ్ట్ చేసే క్రమంలో మొబైల్ కిందపడిపోయింది. దానిని తీసుకునేందుకు సడన్ బ్రేక్ వేయడంతో బైక్ స్కిడ్ అయి కిందపడడంతో తీవ్రగాయాలయ్యాయి.
సికింద్రాబాద్‌కు చెందిన వెంకటేశ్ సెల్ఫోన్లో మాట్లాడుతూ డ్రైవ్ చేస్తూ ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టాడు. దీంతో ఎదురుగా బైక్‌పై వస్తున్న వ్యక్తి తలకు తీవ్రగాయమై ఆసుపత్రి పాలయ్యాడు.
కొంతకాలం క్రితం ఘట్కేసర్ ప్రాంతానికి చెందిన విద్యార్ధి ఇయర్‌ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటూ పరిసరాలను మర్చిపోయాడు. ఘట్కేసర్ గేటు సమీపంలో రైలు పట్టాలు దాటుతుండగా ట్రైన్ ఢీకొని మృ తిచెందాడు.
ఇలా సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం వల్ల, ఇయర్‌ఫోన్స్ పెట్టుకోవడం వల్ల రోజూ ఎక్కడో ఒకచోట ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.
సికింద్రాబాద్, జూలై 5: నేటి ఆధునిక జీవితంలో సెల్‌ఫోన్‌తో విడదీయరాని బంధం ఏర్పడింది. ప్రతి సెకను అంటిపెట్టుకుని ఉండాలన్న ఆసక్తి.. ఏ పరిస్థితుల్లో ఉన్నా కాల్ లిఫ్ట్ చేయాలనే ఆత్రుత… అనేక అనర్థాలకు దారి తీస్తోంది. సెల్‌ఫోన్ డ్రైవింగ్ నేరమని తెలిసినా కొందరు ముందు వెనుకా గమనించకుండా ఇష్టారాజ్యంగా వాహనాలు నడుపుతున్నారు. ట్రాఫిక్ రద్దీలోనూ డ్రైవ్ చేస్తూనే సెల్ఫోన్లలో మాట్లాడుతూ క్షణాల్లో జీవితాలను తలకిందులు చేసుకుంటున్నారు. వారే కాకుండా ఎదుటివారికి ప్రమాదం జరిపి తీవ్ర నష్టాన్ని మిగులుస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే ఎవరికీ ఇబ్బంది ఉండదని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు.
చెవిలో ఇయర్ ఫోన్స్..
చెవుల్లో ఇయర్ ఫోన్స్, బ్లూ టూత్ పెట్టుకుని పరధ్యానంగా డ్రైవ్ చేసే వారు చుట్టు పక్కల శబ్దాలు వినిపించక ప్రమాదాలకు కారణమవుతున్నారు. సెల్‌ఫోన్ డ్రైవింగ్ కన్నా ఇయర్ ఫోన్స్ డ్రైవింగ్ మరింత ప్రమాదకరం. సెల్‌ఫోన్ వాడే వ్యక్తి కేవలం కాల్ వచ్చినప్పుడు మాత్రమే లిఫ్ట్ చేసి మాట్లాడతారు. ఇయర్ ఫోన్స్ డ్రైవింగ్ చేసేవారు ఎక్కువమంది కాల్ మాట్లాడడం కంటే సంగీతం వింటూ ప్రమాదాలకు కారకులుగా మారుతున్నారు.
సెల్‌ఫోన్ డ్రైవింగ్ నేరం
మోటార్ వాహనాల చట్టం ప్రకారం సెల్‌ఫోన్ డ్రైవింగ్ నేరం. 184 సెక్షన్ కింద వాహనాన్ని డ్రైవ్ చేస్తూ సెల్‌ఫోన్ వినియోగిస్తే రూ.1,000 నుంచి రూ.1,500 వరకు జరిమానా విధిస్తున్నాం. అయినా ఇంకా అనేక మందిలో మార్పురావడం లేదు.సెల్‌ఫోన్ డ్రైవింగ్‌పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించి వాహనదారుల్లో మార్పు తెచ్చేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాం.
– అల్లూరి గంగారెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ, నార్త్‌జోన్