సిటీబ్యూరో, జూలై 2 (నమస్తే తెలంగాణ);టీఆర్ఎస్ శ్రేణుల కోలాహలం.. వందలాది బైకులతో ర్యాలీలు.. స్వాగత తోరణాలు.. దారి పొడవునా జెండాల రెపరెపలతో నెక్లెస్‌రోడ్డులోని జలవిహార్ గులాబీమయమైంది. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు శనివారం నగరంలో అపూర్వ స్వాగ తం లభించింది. బేగంపేట ఎయిర్‌పోర్టులో సీఎం కేసీఆర్, మంత్రులు, ఎంపీలు ఘన స్వాగ తం పలికారు. అక్కడినుంచి పార్టీ శ్రేణులతో కలిసి భారీర్యాలీగా నెక్లెస్‌రోడ్డులోని జలవిహార్‌కు చేరుకున్నారు. సుమారు గంటపాటు సాగిన ప్రదర్శనలో సీఎం కేసీఆర్ కాన్వాయ్‌లోనే యశ్వంత్ సిన్హా కూర్చొన్నారు. జలవిహార్ వద్ద తెలంగాణ సంప్రదాయం ప్రకారం మంగళహారతులతో ఆహ్వానించారు. అనంతరం జరిగిన సభలో బీజేపీ అస్తవ్యస్త విధానాలను సీఎం కేసీఆర్ తూర్పారబట్టారు. ప్రజాస్వామ్యం బతికి బట్టకట్టాలనే తాము యశ్వంత్ సిన్హాకు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు.పార్టీ శ్రేణుల ఉత్సాహాన్ని చూసి సిన్హా సంబురపడిపోయారు.
విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు శనివారం నగరంలో అపూర్వ స్వాగతం లభించింది. బేగంపేట ఎయిర్‌పోర్టులో సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్వాగతం పలికారు. నగరం నలుమూలల నుంచి ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న గులాబీ శ్రేణులు.. భారీ బైక్ ర్యాలీలు, గులాబీ జెండా రెపరెపల నడుమ నెక్లెస్‌రోడ్డులోని జలవిహార్‌కు చేరుకున్నారు. దారి పొడవునా గులాబీ తోరణాలు, జై తెలంగాణ నినాదాలతో కార్యకర్తలు హోరెత్తించారు. అనుకున్నదానికంటే టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సిన్హాకు ర్యాలీగా స్వాగతం పలికేందుకు భారీగా తరలిరావడంతో గులాబీ శ్రేణుల్లో ఫుల్ జోష్ నిండింది.
సీఎం కేసీఆర్ కాన్వాయ్‌లోనే కూర్చున్న యశ్వంత్ సిన్హా తెలంగాణ రాష్ట్రం పలికన అద్భుత స్వాగతానికి పులకించిపోయారు. సిన్హాకు స్వాగతం పలికిన వారిలో మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్, సబితాఇంద్రారెడ్డి, ఉపసభాపతి పద్మారావుగౌడ్, ఎంపీలు నామా నాగేశ్వర్రావు, రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, వాణీ దేవి, ప్రభాకర్‌రావు, ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, కేపీ వివేకానంద్, మాధవరం కృష్ణారావు, దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, అరెకపూడి గాంధీ, దానం నాగేందర్, ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్, సాయన్న, మైనంపల్లి హన్మంతరావు, బేతి సుభాష్‌రెడ్డి, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత, రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నాగేశ్ తదితరులు ఉన్నారు.