జూబ్లీహిల్స్,జూలై2: రాష్ట్రపతిగా విజ్ఞుడైన యశ్వంత్ సిన్హా సమర్థుడని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. శనివారం సిన్హా నగరానికి వచ్చిన సందర్భంగా కార్పొరేటర్లతో కలిసి జూబ్లీహిల్స్ నియోజకవర్గం టీఆర్ఎస్ శ్రేణులతో ఎమ్మెల్యే బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా 1500 మంది కార్యకర్తలతో బైక్ ర్యాలీగా యూసుఫ్‌గూడ కృష్ణకాంత్ పార్కు నుంచి బేగంపేట్‌కు.. అక్కడినుంచి జలవిహార్‌కు చేరుకున్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు సీఎన్ రెడ్డి, రాజ్‌కుమార్ పటేల్, దేదీప్య విజయ్, డివిజన్ అధ్యక్షులు సంజీవ, అప్పూఖాన్, కృష్ణమోహన్, సంతోష్ ముదిరాజ్, మ న్సూర్, తన్నూఖాన్, విజయ్‌కుమార్, విజయ్ సిన్హా, సిరాజ్, శ్యామ్‌రావు, విజయ్ ముదిరాజ్, పాల్గొన్నారు.
దారి పొడవునా గులాబీ జెండాలు..
బేగంపేట్ జూలై 2: రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు ఘన స్వాగతం పలికేందుకు మంత్రులు కేటీఆర్, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్, శ్రీనివాస్‌గౌడ్, ఇంద్రకరణ్‌రెడ్డి, సత్యవతిరాథోడ్, పువ్వాడ అజయ్‌కుమార్,డిప్యూటీ స్పీకర్ పద్మారావు, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, మాగంటి గోపీనాథ్, దానం నాగేందర్ బేగంపేట్ ఎయిర్‌పోర్ట్‌కు ఉదయం పది గంటలకే చేరుకున్నారు. సీఎం కేసీఆర్ 11.15 గంటలకు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. 11.45 నిమిషాలకు సిన్హా ఎయిర్‌పోర్టులో దిగారు. 12 గంటలకు భారీ ర్యాలీతో నెక్లెస్‌రోడ్డులోని జలవిహార్‌కు చేరుకున్నారు.
బైక్‌లపై తరలివచ్చిన కార్యకర్తలు
బేగంపేట్ జూన్ 2: సిన్హాకు స్వాగతం పలికేందుకు గులాబీ నాయకులంతా బేగంపేట్ ఎయిర్‌పోర్ట్‌కు తరలివచ్చారు. బైకులపై టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు వేల సంఖ్యలో తరలి రావడంతో ఎయిర్పోర్ట్ ప్రాంగణం అంతా గులాబీ మయంగా మారింది. నాగోల్, సికింద్రాబాద్, తార్నాక, హబ్సిగూడ, మెట్టుగూడ నుంచి టీఆర్ఎస్ కార్యకర్తలు సికింద్రాబాద్ ఎస్పీ రోడ్డు మీదుగా ర్యాలీ నిర్వహిస్తూ ఉదయం 9 గంటల వరకే బేగంపేట్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. దీంతో సికింద్రాబాద్ రాష్ట్రపతి రోడ్డు, మహాత్మాగాంధీ రోడ్డు, మినిస్టర్రోడ్డు రహదారులు గులాబీ మయంగా మారాయి. బేగంపేట్ డివిజన్ కార్పొరేటర్ మహేశ్వరి శ్రీహరి నేతృత్వంలో పాటిగడ్డ పైగా ప్యాలెస్, అలాగే కూకట్పల్లి నుంచి తాతాచారి కాలనీ మీదుగా పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.
తలసాని సాయికిరణ్‌యాదవ్ ఆధ్వర్యంలో..
సిన్హాకు టీఆర్ఎస్ సికింద్రాబాద్ పార్లమెంట్ ఇన్చార్జి తలసాని సాయికిరణ్‌యాదవ్ ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్డులో ఘన స్వాగతం పలికేందుకు టీఆర్ఎస్ యువత బైకులపై తరలివచ్చారు. జై కేసీఆర్, జై తెలంగాణ నినాదాలతో నెక్లెస్‌రోడ్డులో హోరెత్తించారు. బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి నెక్లెస్ రోడ్డులోని జలవిహార్ వరకు వీరి ర్యాలీ కొనసాగింది.
ఎర్రగడ్డ, బోరబండ డివిజన్ల నుంచి..
ఎర్రగడ్డ, జూలై 2: సిన్హాకు స్వాగతం పలికేందుకు గులాబీ శ్రేణులు బైక్ ర్యాలీ నిర్వహించగా ఎర్రగడ్డ, బోరబండ డివిజన్ల నుంచి అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎర్రగడ్డ డివిజన్ అధ్యక్షుడు సంజీవతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.