సికింద్రాబాద్, జూన్ 30: రాష్ట్ర ప్రభుత్వం సకల జనుల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతుందని డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ అన్నారు. ఈ మేరకు గురువారం సీతాఫల్‌మండిలోని తన క్యాంపు కార్యాలయంలో మెట్టుగూడకు చెందిన 12 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీముబారక్, ఐదుగురికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను స్థానిక నేతలతో కలిసి డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా పద్మారావుగౌడ్ మాట్లాడుతూ ..సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తరువాత అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలను ప్రారంభించారన్నారు. మహిళల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. దేశంలోనే మన రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తోందన్నారు. జనాభాలో సగ భాగం మహిళలదేనని, వారిని తగిన రీతిలో ప్రోత్సహిస్తే రాణిస్తారన్నారు. రాష్ట్ర సర్కారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి రాజకీయ నాయకులు, అధికారులు అవగాహన కలిగి ఉండాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలతో ప్రజలు విసిగిపోయి సీఎం కేసీఆర్ సేవలు దేశానికి అవసరమని కోరుకుంటున్నారని గుర్తు చేశారు. పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు ప్రజలందరికీ అందుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్ సునీత, నేతలు రామేశ్వర్‌గౌడ్, కిశోర్‌కుమార్ గౌడ్‌తో పాటు రామచంద్రు తదితరులు పాల్గొన్నారు.