రవీంద్రభారతి, జూన్ 28: హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ఎల్.శర్మన్ మానవతావాది అని పలువురు వక్తలు కొనియాడారు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌గా ఈ నెల 30వ తేదీన పదవీ విరమణ పొందుతున్న శర్మన్‌కు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం రవీంద్రభారతిలో సన్మాన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి కేజీ బాలకిషన్, మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్యలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి బాలకిషన్ మాట్లాడుతూ విద్యతోనే బంగారు భవిష్యత్తు సాధ్యమౌతుందని పేర్కొన్నారు. అట్టడుగు వర్గాల ప్రజలకు శర్మన్ అనేక సేవలందించారని తెలిపారు. కలెక్టర్‌గా తన బాధ్యతను ఎంతో క్రమశిక్షణతో పనిచేసి పేదల మన్నలను పొందిన గొప్ప పరిపాలనాధ్యక్షుడని సేవల్ని కొనియాడారు.
మానవ హక్కుల చైర్మన్ జస్టిస్ చంద్రయ్య మాట్లాడుతూ వెనుకబడిన వర్గాల వారికి జిల్లా కలెక్టర్‌గా ఉండి అనేక సేవలందరించారని కీర్తించారు. చదవడానికి సరైన దారిలేని గ్రామంలో జన్మించి హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌గా శర్మన్ రాణించడం ఎంతో గొప్ప విషయమని ఆయనను అభినందించారు. శర్మన్ సేవలను ప్రభుత్వం వినియోగించుకోవాలన్నారు. ఎమ్మెల్సీ గోరటి వెంకన్న మాట్లాడుతూ ఎల్.శర్మన్ మానవత్వం ఉన్న మంచి కలెక్టర్‌గా పేరు తెచ్చుకున్న మహనీయుడన్నారు. తమ జిల్లా నాగర్‌కర్నూల్‌లో కలెక్టర్‌గా పనిచేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రజల మన్నలను పొందిన గొప్ప మానవతావాది అని ఆయన కొనియాడారు. ఆయన ఎక్కడా ఉన్నా ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అభిషేక్‌రెడ్డి మాట్లాడుతూ శర్మన్ మంచి అడ్మినిస్ట్రేటర్‌గా బడుగు బలహీన వర్గాలకు ఎంతో సేవ చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ, పలువురు ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొన్నారు.