సిటీబ్యూరో, జూన్ 28 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్ హైదరాబాద్లో ఉన్న 185 చెరువుల అభివృద్ధికి జీహెచ్ఎంసీ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. కోట్లాది రూపాయలు వెచ్చిస్తూ.. చెరువులను అభివృద్ధి చేస్తున్నది. మిషన్ కాకతీయతో పాటు జీహెచ్ఎంసీ నిధులతో చెరువుల పటిష్టత, సుందరీకరణ, మురుగు నీరు డైవర్షన్ లాంటి పనులను చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నారు. ప్రభుత్వానికి తోడుగా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) నిధుల ద్వారా చెరువుల అభివృద్ధికి స్వచ్ఛందంగా కార్పొరేట్ సంస్థలు ముందుకొస్తున్నాయి. ఇప్పటి వరకు 25 చెరువులను అభివృద్ధి చేసేందుకు ముందుకు వచ్చినట్లు మంగళవారం జీహెచ్ఎంసీ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
ఇప్పటికే సీఎస్ఆర్ నిధులతో చేపట్టిన 10 చెరువుల్లో కొన్ని అందుబాటులోకి రాగా, మిగిలినవి పురోగతిలో ఉన్నట్లు చెప్పారు. మరో నాలుగు చెరువుల అభివృద్ధి పనులు, నిర్వహణకు మరొక ఏడాది పొడిగించాలని ఆయా ఏజెన్సీలు కోరుతున్నాయని వివరించారు. వీటితో పాటు మిషన్ కాకతీయ ద్వారా 19 చెరువుల అభివృద్ధి చేపట్టగా ప్రగతి దశలో ఉన్నట్లు తెలిపారు. జీహెచ్ఎంసీ నిధుల ద్వారా 63 చెరువుల అభివృద్ధి పనులు చేపట్టగా.. అందులో 43 చెరువుల పనులు పూర్తయ్యాయని తెలిపారు. మిగతా చెరువుల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. అంతేకాకుండా, 42 చెరువుల్లో ట్రీ ప్లాంటేషన్, సుందరీకరణ పనులు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.