బన్సీలాల్‌పేట్, జూన్ 28 : పేదలు ఆత్మగౌరవంతో జీవించేలా ఇండ్లు నిర్మించి ఇవ్వాలనే సీఎం కేసీఆర్ కల సాకారమయ్యిందని, 162 కుటుంబాలు టీఆర్ఎస్ ప్రభుత్వానికి రుణపడి ఉంటాయని బన్సీలాల్‌పేట్ కార్పొరేటర్ కె.హేమలత అన్నారు. డివిజన్లోని పొట్టి శ్రీరాములునగర్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల బహుళ అంతస్తుల భవనం నిర్మించి, లబ్ధిదారులకు అందజేసి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా మంగళవారం సంబురాలు చేసుకున్నారు. ముందుగా ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం ప్రత్యేక కేక్ కట్ చేసి కార్పొరేటర్‌కు, బస్తీ వాసులకు తినిపించారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ హేమలత మాట్లాడుతూ.. గత ఏడాది జూన్ 28న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి, సికింద్రాబాద్ ఆర్డీవో వసంత కుమారి, తాసీల్దార్ బాలశంకర్, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ బి.శ్రీనివాస్ రెడ్డి, డీసీ ముకుందరెడ్డి, టీఆర్ఎస్ సికింద్రాబాద్ పార్లమెంట్ ఇన్చార్జి తలసాని సాయికిరణ్ యాదవ్‌తో కలిసి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కాలనీని ప్రారంభించుకున్నామని తెలిపారు. పీఎస్ నగర్ వాసులకు డబుల్ ఇండ్ల నిర్మాణానికి మంత్రి శ్రీనివాస్ యాదవ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని తెలిపారు.
40 ఏండ్లుగా శ్మశనవాటిక పక్కన, కనీస సదుపాయాలు లేక, ఇరుకైన ఇండ్లలో జీవించిన పీఎస్‌నగర్ బస్తీవాసుల కష్టాలు ఇప్పుడు తొలిగిపోయాయని అన్నారు. పేద ప్రజల నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా వారు ఆత్మగౌరవంతో జీవించేలా రెండు పడక గదులు, హాలు, కిచెన్, టాయిలెట్లతో కూడిన ఇల్లును లబ్ధిదారులకు అందజేయడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. మంత్రి తలసాని తన సొంత నిధులతో అమ్మవారి ఆలయాన్ని నిర్మించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు కె.లక్ష్మీపతి, కమల్‌కుమార్, కాలనీవాసులు సాయి, అశోక్, కార్తిక్, శ్రీకాంత్, చంద్రకళ, లక్ష్మి, అంజయ్య, రాజూయాదవ్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.