సిటీబ్యూరో, జూన్ 22 (నమస్తే తెలంగాణ): మహిళలు, పిల్లలపై అఘాయిత్యాలు, అత్యాచారాలు, వేధింపులు తదితర ఘోరమైన ఘటనలు జరిగిన సమయంలో బాధితులకు అన్ని రకాల సేవలు ఒకే చోట అందించాలనే లక్ష్యంతో 2016లో హైదరాబాద్ పోలీసులు ‘భరోసా’ కేంద్రాన్ని అందుబాటులోకి తెచ్చారు. స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకుంటూ.. షీ టీమ్స్ స్ఫూర్తితో నగర పోలీసులు ఈ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. భరోసా కేంద్రానికి ఫోన్ చేసినా, స్వయంగా వెళ్లి ఫిర్యాదు చేసినా.. పోలీస్ స్టేషన్‌కు వెళ్లకుండానే అన్ని రకాల సేవలు ఈ కేంద్రంలో అందుతున్నాయి. బాధితులకు కావాల్సిన వైద్య, ఆరోగ్యసేవలు, విద్య, న్యాయ సేవలు, మానసిక ఒత్తిడికి లోనైన వారికి నిపుణుల కౌన్సెలింగ్, శిక్షణ, పునరావాస సౌకర్యం కల్పిస్తూ సమాజంలో వారు తలెత్తుకొని తిరిగే విధంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ సంస్థ పనిచేస్తున్నది. నిందితులకు శిక్ష పడేలా చేస్తున్నది.
బాధితులకు ఉచిత విద్య, వైద్యం
ఇప్పటి వరకు భరోసా కేంద్రానికి వచ్చిన 47 మంది బాధితులకు ఉచిత విద్యనందించారు. 78 మందికి స్వచ్ఛంద సంస్థలు ఆశ్రయం కల్పించాయి. 63 మందికి ప్రైవేట్ దవాఖానల్లో చికిత్స నిర్వహించగా, 121 మందికి సహాయ నిధి అందించారు. 50 మందికి పునరావసం కోసం స్వచ్ఛంద సంస్థలు తమ వంతు సహకారాన్ని అందిస్తున్నాయి. కాగా, ఎవరైనా వేధింపులకు గురిచేస్తే బాధితులు డయల్ 100కు ఫిర్యాదు చేయాలని సీపీ సీవీ ఆనంద్ సూచించారు. భరోసా కేంద్రంలో షీ టీమ్స్ అదనపు డీసీపీ శిరీష నేతృత్వంలో సేవలు అందిస్తున్న సిబ్బందిని అభినందించారు.
పదమూడేండ్ల బాలికపై తన పిన తండ్రి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలు తనకు జరిగిన అన్యాయాన్ని తన ఉపాధ్యాయురాలికి చెప్పింది. చలించిపోయిన ఉపాధ్యాయురాలు చైల్డ్‌లైన్‌కు సమాచారం అందించింది. వారి సాయంతో బాధితురాలు కాచిగూడ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు వెంటనే హైదరాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో కొనసాగుతున్న భరోసా కేంద్రానికి పంపించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కామినేనిలో చేర్పించి ఉచిత వైద్యం చేయించారు. పూర్తిగా కోలుకున్న తర్వాత ఆమె భరోసా కేంద్రంలో జరిగిన విషయాలు వివరించింది.
2018లో జరిగిన ఈ ఘటనతో తీవ్ర మనోవేదనకు గురైన బాలిక భరోసా కేంద్రంలో ఆత్మవిశ్వాసం పెంపొందించుకున్నది. పదో తరగతి 2018లో పూర్తి చేసి 9.75/10 జీపీఏతో పాస్ అయ్యింది. ఇంటర్ పూర్తి చేసి ఓ మహిళా ఐపీఎస్ అధికారి సహకారంతో ప్రస్తుతం సీఏ కోచింగ్ తీసుకుంటుంది. అయితే 2018లో నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించగా.. పూర్వపరాలను పరిశీలించిన న్యాయస్థానం నిందితుడికి 20ఏండ్లు కఠినకారాగార శిక్ష, బాధితురాలిని బెదిరించిన నిందితుడి సోదరుడికి మూడేండ్ల జైలు శిక్ష పడింది. కాగా బాధితురాలి గోప్యతను కాపాడుతూ అండగా నిలిచిన భరోసా కేంద్రం, హైదరాబాద్ పోలీసులకు బాధితురాలు కృతజ్ఞతలు తెలిపింది.