సిటీబ్యూరో, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ): డ్రగ్స్ స్మగ్లర్ టోనీ ఐదు రోజుల కస్టడీలో వెల్లడించిన అంశాలను విశ్లేషించిన సిటీ పోలీసులు.. అతడికి మత్తు పదార్థాలు సరఫరా చేస్తున్న మరో అంతర్జాతీయ స్మగ్లర్ ‘స్టార్‌బాయ్’ భారత్‌లోనే ఉండవచ్చని అనుమానిస్తున్నారు. పట్టుకునేందుకు ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. గత నెల 20న టోనీని నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. మాదక ద్రవ్యాల నెట్‌వర్క్‌ను కూకటివేళ్లతో పెకిలించి వేస్తామంటూ..సిటీ పోలీస్ కమిసనర్ సీవీ ఆనంద్ వెల్లడించడం, అన్నట్టుగానే ముంబైలో 10 రోజుల పాటు గాలించి టోనీని అరెస్ట్ చేయడం చకచకా జరిగిపోయింది. అలాగే అతడి కస్టమర్లు అయిన పలువురు వ్యాపారులను సైతం పట్టుకున్నారు. తనకు ఆఫ్రికన్ దేశాల నుంచి ‘స్టార్‌బాయ్’ అనే వ్యక్తి హెరాయిన్ సరఫరా చేస్తున్నాడంటూ.. టోనీ పోలీసులకు వెల్లడించాడు. కస్టడీలో మరిన్ని విషయాలు బయటపెట్టడంతో వాటిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు.
దర్యాప్తు ముమ్మరం..
టోనీపై గతంలోనే హైదరాబాద్‌లో కేసులు ఉండటం, ఎస్కే పేరుతో చలామణి కావడం, విచారణలో స్టార్‌బాయ్ కూడా హైదరాబాద్‌కు వచ్చిపోయినట్లు టోనీ చెప్పిన విషయాలను పరిగణలోకి తీసుకొని దర్యాప్తు ముమ్మరం చేశారు. స్టార్‌బాయ్ భారత్‌లోనే ఉండే అవకాశాలున్నాయని భావిస్తూ.. అతడి కోసం వేట కొనసాగిస్తున్నారు. ఇదిలాఉండగా టోనీతో వ్యాపార లావాదేవీలు నిర్వహించిన ఏజెంట్లతోనూ సమాచారాన్ని రాబడుతున్నారు. టోనీ ఒక్కడే వీళ్లతో వ్యాపారం చేయిస్తున్నాడా? ఇతరులెవరైనా దీని వెనుక ఉన్నారా? అనే విషయాలపై ఆరా తీస్తున్నారు.