మణికొండ, జూన్ 22 : తెలుగు రాష్ర్టాలలో మొదటిసారిగా నేషనల్ అసిస్మెంట్, అక్రెడిటేషన్ కౌన్సిల్ ద్వారా ఏ ప్లస్ ప్లస్, సీజీపీఏ గ్రేడ్‌లో మహిళా ఇంజినీరింగ్ కళాశాలకు రెండో స్థానం దక్కడం అభినందనీయమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గండిపేట మండలం వట్టినాగులపల్లిలోని శ్రీదేవి మహిళా ఇంజినీరింగ్ కళాశాలను ఇటీవల నేషనల్ అసిస్మెంట్, అక్రెడిటేషన్ కౌన్సిల్ బృందం సందర్శించింది. కళాశాలలో ఏర్పాటు చేసిన సౌకర్యాలు, బోధన పద్ధతి, పర్యావరణం, సాంకేతిక విద్య, పరిశోధనశాలల పనితీరును పరిశీలించిన న్యాక్ బృందం సంతృప్తి వ్యక్తం చేసింది. ఇటీవల శ్రీదేవి ఇంజినీరింగ్ కళాశాలకు రెండు తెలుగు రాష్ర్టాలలో ఏ ప్లస్ ప్లస్, సీజీపీఏ గ్రేడ్ 4 పాయింట్ల స్కేల్ 3.6 సాధించి 2వ స్థానంలో నిలిచినట్లు న్యాక్ ప్రతినిధులు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీచేశారు.
ఈమేరకు మంగళవారం మంత్రి సబితారెడ్డి చేతుల మీదుగా మంత్రి కార్యాలయంలో న్యాక్ పత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మహిళలకు ఉన్నతమైన సాంకేతిక విద్యను అందించాలన్న సంకల్పంతో స్థాపించిన శ్రీదేవి మహిళా ఇంజినీరింగ్ కళాశాలకు న్యాక్ గ్రేడ్‌లో 2వ స్థానం దక్కడం అధ్యాపకుల కృషి ఫలితమని అభినందించారు. మహిళలకు సమానమైన విద్యను అందించాలన్న సంకల్పంతో స్థాపించిన దివంగత అశోక్‌రావు ఆశయసాధనలో ఇదో మైలురాయిగా నిలిచిందని కళాశాల వైస్ చైర్మన్ డా.కె.రాధాకిషన్‌రావు అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ వెంకటరమణ, కళాశాల ప్రిన్సిపాల్ మల్లేశ్వరి, అధ్యాపకులు పాల్గొన్నారు.