మేడ్చల్, జూన్21(నమస్తే తెలంగాణ): మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని నివాస ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పర్యటించి ఇళ్ల క్రమబద్ధీకరణకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ హరీశ్ అధికారులను ఆదేశించారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్లోని సమావేశం హాల్లో మంగళవారం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ హరీశ్ మాట్లాడుతూ 58 జీవోలో వచ్చిన దరఖాస్తుల పరిశీలన మరో 5 రోజుల్లో పూర్తి చేయాలన్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ఇళ్లను క్రమబద్ధీకరణ చేయాలని అధికారులకు సూచించారు. జిల్లా వ్యాప్తంగా 40 వేల దరఖాస్తులు వచ్చాయని, వాటిని పరిశీలించేందుకు 80 అధికార బృందాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ హరీశ్ పేర్కొన్నారు. క్రమబద్ధీకరణ విషయమై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రతి నిత్యం 58 జీవో దరఖాస్తుల పరిశీలనపై ప్రత్యేక దృష్టి సారించినట్లు వివరించారు.
ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించవద్దు..
ఇళ్ల క్రమబద్ధీకరణ విషయంలో ప్రభుత్వ నిబంధనలు, సూచనలు ఉల్లంఘించరాదని దీనిని దృష్టిలో పెట్టుకొని క్రమబద్ధీకరణ చేయాలని కలెక్టర్ హరీశ్ అన్నారు. క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తులు చేసుకున్న వారి ఇళ్ల ఫొటోలు నిబంధనల మేరకు ఉన్నట్లయితే అప్లోడ్ చేయాలన్నారు. క్రమబద్ధీకరణ విషయంలో అధికారులందరూ సమన్వయంతో ముందుకు వెళ్లాలని పేర్కొన్నారు. ఇళ్ల క్రమబద్ధీకరణకు ఇప్పుడు ఉన్న సిబ్బంది సరిపోనట్లయితే మరి కొంతమంది సిబ్బందిని నియమిస్తామని తెలిపారు. సమావేశంలో క్రమబద్ధీకరణ విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు అడిగిన సందేహాలకు కలెక్టర్ హరీశ్ నివృత్తి చేశారు. ఈ సమీక్షా సమావేశంలో అదనపు కలెక్టర్లు నర్సింహారెడ్డి, జాన్ శ్యాంసన్, ఆర్డీవోలు మల్లయ్య, రవి, ఏవో వెంకటేశ్వర్లు, మున్సిపల్ అధికారులు, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.