గోల్నాక, జూన్ 21: కొన్ని శతాబ్దాలుగా సామాజిక వివక్షకు, అణిచివేతకు గురువుతున్న దళితులను సంపూర్ణ సాధికారులను చేయడానికి సీఎం కేసీఆర్ దళిత బంధు పథకం ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. లబ్ధిదారులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని ఆయన పిలుపు నిచ్చారు. మంగళవారం గోల్నాక డివిజన్ సెల్వాగార్డెన్లో దళిత బంధు పథకం రెండో విడుత ఎంపికైన రెండు వందల మంది లబ్ధిదారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరై.. పథకం సద్వినియోగంపై అవగాహన కల్పించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో దళితుల జీవితాల్లో గుణాత్మక మార్పుకోసం సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా దళిత బంధు పథకం ప్రవేశ పెట్టి అమలు చేస్తున్నారన్నారు. నియోజకవర్గంలో ఇప్పటికే వంద మంది లబ్ధిదారులకు యూనిట్లు మంజూరు చేశామని తెలిపారు.
మరో 15వందల కుటుంబాలకు గాను ప్రస్తుతం రెండు వందల కుటుంబాలు ఎంపిక చేశామని వివరించారు. ప్రాధాన్యత క్రమంలో నియోజకవర్గంలోని ప్రతి దళిత కుటుంబానికి పథకం ప్రయోజనాన్ని వర్తింప జేస్తామని తెలిపారు. ఈ విషయంలో ఎలాంటి అపోహలకు గురి కావద్దని సూచించారు. లబ్ధిదారులు తమ ఇష్టమైన రంగంలో రాణించి దళిత బంధు పథకాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగడంతో పాటు జీవితంలో స్థిరపడాలన్నదే తెలంగాణ ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమన్నారు. దళిత బంధు పథకాన్ని ఎలాంటి అవకతవకలు లేకుండా పారదర్శంగా అమలు చేస్తున్నామని, ఎవరైనా దళారులు పథకం కోసం డబ్బులు అడిగితే నేరుగా తనకు తెలియజేయాలని సూచించారు. అలాంటి వారిపై కఠినంగా వ్యవహిస్తామని హెచ్చరించారు. రూ.పది లక్షలతో ఒకే యూనిట్ కాకుండా కుటుంబంలోని సభ్యులకు రెండు, మూడు యూనిట్లు కూడా ఎంపిక చేసుకోవచ్చని తెలిపారు. ఆదాయాన్ని ఇచ్చే యూనిట్లు ఎంపిక చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.
దళితుల పక్షపాతి సీఎం కేసీఆర్
దేశంలో ఎక్కడా లేని విధంగా దళితుల కండ్లలో వెలుగులు నింపడం కోసం ప్రతిష్టాత్మకంగా దళితబంధు కార్యక్రమం అమలు చేస్తూ దళితుల పక్షపాతిగా సీఎం కేసీఆర్ నిలిచారు. సీఎం కేసీఆర్‌కు దళిత సమాజం రుణపడి ఉంటుంది. ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ రాజకీయాలకు అతీతంగా లబ్ధిదారులను ఎంపిక చేయడం అభినందనీయం.
– బి.దీపక్‌కుమార్,మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు
దళితుల జీవితాల్లో వెలుగులు
సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళిత బంధు పథకం దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయి. కొన్ని శతాబ్దాలుగా సామాజిక వివక్షకు గురైన దళితులకు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పడు సరైన గౌరవం దక్కింది. ఇప్పటి వరకు కూలీలుగా పని చేసిన దళితులు యజమానుల్లా మారుతున్నారు. సీఎం అమలు చేస్తున్న ఈ పథకం చారిత్రాత్మకం.
– పులిజాల గెల్వయ్య, రాష్ట్ర అధ్యక్షుడు,కమ్యూనిస్ట్ ఆఫ్ తెలంగాణ పార్టీ