అబిడ్స్, సుల్తాన్‌బజార్, తెలుగు యూనివర్శిటీ, జూన్ 21 : యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం గోషామహల్, నాంపల్లి, కార్వాన్ నియోజకవర్గాల పరిధిలోని పలు ప్రాంతాల్లో యోగా కార్యక్రమాలు నిర్వహించారు. పలు పాఠశాలలు, కళాశాలలు, క్రీడా మైదానాలు తదితర ప్రాంతాల్లో యోగా నిర్వహించారు. రోజుకో గంట సమయానికి తగ్గకుండా యోగా చేయాలని గురువులు సూచించారు. ఉదయం, సాయంత్రం ఆరు తర్వాత చేయడం మంచిదని, ఆహారం తీసుకున్న 4 గంటలలోపు యోగా చేయరాదని వారు సూచించారు. ప్రతి ఒక్కరూ మధుమేహం, బీపీ, ఊబకాయం వంటి సమస్యలతో సతమతమౌతున్నారని, వీటన్నింటికీ ఒకటే మంత్రం యోగా అని వారు వివరించారు. తినే ఆహారపు అలవాట్లలో కూడా మార్పు రావాలని, తద్వారా శరీర బరువును అదుపులో ఉంచుకునే వీలుంటుందని గురువులు సూచనలు చేశారు.
వనితా మహావిద్యాలయంలో ..
నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో నిర్వహించిన యోగా దినోత్సవ కార్యక్రమంలో యోగాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. ఇండియన్ ఫెడరేషన్ యోగా అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ పురోహిత్, తెలంగాణ యోగా అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్.రవికుమార్‌లను వనితా మహావిద్యాలయ కళాశాల చైర్మన్ ఆదిత్యమార్గం, ప్రిన్సిపాల్ డాక్టర్ డి.శోభన సత్కరించారు.
మార్గదర్శిని స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో..
ఇసామియాబజార్‌లోని మార్గదర్శిని స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జరిగిన యోగా దినోత్సవం కార్యక్రమంలో వ్యవస్థాపకురాలు అరుణజ్యోతి, యోగా గురు సబిత, శ్రీనివాస్, కిశోర్, రాజేశ్, నిహారిక, నీలిమ యోగాభ్యాసం చేశారు.
యోగా డే సందర్భంగా ఆసనాలు
అంతర్జాతీయ యోగా డే ను పురస్కరించుకొని సంతోష్ నగర్ కాలనీలో మార్నింగ్ యోగా ప్రతినిధులు యోగా అభ్యసనం చేశారు.
యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం నాంపల్లి నియోజకవర్గం మెహిదీపట్నం డివిజన్లోని సంతోష్‌నగర్ కాలనీ పార్కులో యోగా కేంద్రం ఆధ్వర్యంలో యోగా గురువులు స్థానికులకు యోగా ప్రాముఖ్యతను వివరించారు.
మానవాళికి బహుమతి యోగా అని జాతీయ మైనార్టీ కమిషన్ సభ్యురాలు షేహజాది అన్నారు. మంగళవారం యోగా దినోత్సవం సందర్భంగా ఉప్పుగూడ తానాజీనగర్లో లక్ష్మణ్ వ్యాయామశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మాస్టర్ ఓగపల్లి లక్ష్మణ్ షేహజాది, ఫలక్‌నుమా ఏసీపీ షేక్ జహంగీర్లకు శాలువాకప్పి సన్మానించారు. మాస్టర్ శ్రీ ప్రీతాజీ విద్యార్థులకు యోగాసనాలలో శిక్షణ ఇచ్చారు.
తెలుగు విశ్వ విద్యాలయంలో ..
యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం ఎన్ఎస్ఎస్, యోగా శాఖ ఆధ్వర్యంలో ప్రదర్శన పూర్వక ప్రసంగాన్ని నిర్వహించారు. యోగా వల్ల కలిగే ప్రయోజనాలు, తొలగిపోయే రుగ్మతలు, ఏ ఆసనం ఎందుకు పనికి వస్తుంది, ఆసనాల వలన కలిగే లాభాలను యోగా అధ్యాపకురాలు పార్వతి ఆసనాలను ప్రదర్శిస్తూ ప్రసంగం చేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్య భట్టు రమేశ్ విచ్చేశారు. కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ కో ఆర్డినేటర్ డాక్టర్ కె.రత్నశ్రీ, అదనపు కో ఆర్డినేటర్ పాల్, కో కో ఆర్డినేటర్ మహేశ్ పాల్గొన్నారు.