ఎల్బీనగర్, జూన్ 20: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన దళితబంధు పథకం దేశంలోనే అత్యుత్తమమైనదని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. ఎల్బీనగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దళితబంధు పథకం ద్వారా మంజూరైన వాహనాలను (కారు) ఎమ్మెల్సీలు యెగ్గె మల్లేశం కురుమ, బొగ్గారపు దయానంద్గుప్తతో కలిసి ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ.. దళితుల సాధికారత కోసం ప్రవేశపెట్టిన దళితబంధు పథకం అద్భుతమైనదని పేర్కొన్నారు.
దళితబంధు పథకం ద్వారా ప్రభుత్వం రూ. 10 లక్షలు అందజేస్తున్నదన్నారు. ఎమ్మెల్సీలు యెగ్గె మల్లేశం కురుమ, బొగ్గారపు దయానంద్ గుప్త మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలోని దళితులను అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతోనే దళితబంధు పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొత్తపేట డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు లింగాల రాహుల్‌గౌడ్, మహిళా అధ్యక్షురాలు దేవిరెడ్డి శ్వేతారెడ్డి, ఉదయ్ గౌడ్, యాదగిరి, యాసిన్, నగేశ్, ఎస్సీ కార్పొరేషన్ అధికారి ప్రవీణ్‌తో పాటుగా దళితబంధు లబ్ధిదారులు పాల్గొన్నారు.