కవాడిగూడ, జూన్ 20: మోదీ, యోగి ‘ద్వేషపూరిత రాక్షసులు’ గా మారి మైనారిటీలనే లక్ష్యంగా చేసుకొని ప్రవేశపెట్టిన బుల్డోజర్ సంస్కృతి దేశానికి ప్రమాదకరమని ఇన్సాఫ్ జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు సయ్యద్ అజీజ్ పాషా ఆందోళన వ్యక్తం చేశారు. నీచమైన మత రాజకీయాలను సుస్థిరం చేయడానికి కేంద్రం, బీజేపీ పాలిత రాష్ర్టాలు బుల్డోజర్లను ఆయుధాలుగా ఉపయోగించి మైనారిటీలపై దాడులు చేస్తూ జీవించే హక్కును కాలరాస్తున్నారని, వారి ఇండ్లు, ఆశలను కూల్చివేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ మేరకు సోమవారం ఇందిరాపార్కు ధర్నాచౌక్లో మైనారిటీలపై దాడులు, బుల్డోజర్ సంస్కృతిని నిరసిస్తూ అఖిల భారత తంజీమ్- ఏ- ఇన్సాఫ్ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అజీజ్ పాషా మాట్లాడుతూ.. ప్రస్తుతం దేశంలోని బీజేపీ పాలిత రాష్ర్టాలలో బుల్డోజర్ సంస్కృతి కొనసాగుతున్నదని ఆరోపించారు. మైనారిటీలు తమ హక్కులపై ప్రశ్నించి నిరసనలు తెలిపితే పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తున్నారని, బుల్డోజర్తో వారి ఇండ్లను కూల్చివేస్తూ వారు నివసించే ప్రాంతాల్లో లేకుండా యోగి సర్కార్ చేస్తున్నదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలపై దాడులు చేస్తే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఇన్సాఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మునీర్ పటేల్, బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాండురంగా చారి, నాయకులు శంషోద్దీన్, గౌస్, ఎండీ సలీం తదితరులు పాల్గొన్నారు.