ఖైరతాబాద్, జూన్ 20: విద్య, వైద్యం, ఫ్యాషన్, టెక్నాలజీ, పర్యాటకం తదితర రంగాల్లో ప్రపంచ చిత్ర పటంలో తెలంగాణ ప్రత్యేక స్థానంలో నిలిచిందని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు అన్నారు. సోమవారం సాయంత్రం సోమాజిగూడలోని ది పార్క్ హోటల్లో ముల్తాయ్ స్టూడియో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంబీసీ సీజన్-4, ఎస్బీఎంఎస్ సీజన్ – 4 (బ్రైడల్ మేకప్ కాంపిటీషన్స్), ఎడీఎఫ్సీ సీజన్-1 (జాతీయ స్థాయి ఫ్యాషన్ డిజైనర్స్ కాంపిటీషన్), సైమా సీజన్-1 (జాతీయ స్థాయి బ్యూటీ ఎక్స్పో) తదితర కార్యక్రమాలకు సంబంధించిన పోస్టర్లను డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావుతో పాటు టాలీవుడ్ నటీ నజియా ఖాన్, మోడల్ ఆర్టిస్ట్ సంధ్యారాణి, కోరియోగ్రాఫర్లు నిక్సన్ క్రూజ్, గణేశ్, ప్రొఫెసర్ రేఖారావుతో కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఒకప్పుడు తెలంగాణ వెనకబడిందని చెప్పే వారని, ఇప్పుడు ఈ ప్రాంతం ప్రపంచంలోనే ఓ ప్రత్యేక స్థానాన్ని సంతరించుకుందన్నారు. ముల్తాయ్ స్టూడియోస్ వారు చేపట్టిన ఈ కార్యక్రమం విజయవంతం కావాలని, 33 జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల్లోని నైపుణ్యం కలిగిన యువతీ యువకులను హైదరాబాద్కు తీసుకువచ్చి కాస్మోటిక్స్, కాస్ట్యూమ్స్ తదితర రంగాల్లో శిక్షణ ఇప్పించాలన్నారు. ఏ రంగంలోనూ తెలంగాణ వెనుకబడవద్దన్నారు. ఇప్పుడు ముంబై, బెంగుళూరు నగారాలకు సవాల్ విసురుతున్నామన్నారు. పర్యాటక శాఖ మంత్రి, టూరిజం ప్రిన్సిపాల్ సెక్రటరీతో మాట్లాడి కావాల్సిన నిధులను సమకూరుస్తామన్నారు. యువ ఎంటర్ప్రెన్యూయర్స్ తయారు చేయడానికి ఇది చక్కని వేదిక అన్నారు.