హిమాయత్‌నగర్, జూన్ 20: విద్యుత్ షార్ట్ సర్యూట్‌తో ఓ ట్రావెల్స్ సంస్థ కార్యాలయంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటన నారాయణగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. ఎస్సై నరేశ్, సంస్థ ప్రతినిధులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. లోయర్ ట్యాంక్ బండ్ సమీపంలో నివాసముండే అశోక్ గత పదేండ్లుగా హిమాయత్‌నగర్ వీధి నం.2లోని ఓ భవనంలో మూడవ అంతస్తులో హాలిడే బజార్ ట్రావెల్స్ కార్యాలయం నడుపుతున్నాడు. సోమవారం ఉదయం 5 గంటల సమయంలో కార్యాలయం లోపలి నుంచి దట్టమైన పొగలు, మంటలు వ్యాపించాయి.
గమనించిన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించగా వెంటనే అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.40 లక్షల విలువైన 28 కంప్యూటర్లు, 6 ల్యాప్‌టాప్‌లు, 11 ఏసీలు, రెండు సెల్ఫోన్లు, ఫర్నిచర్ తదితర వస్తువులు కాలిపోయినట్లు మేనేజర్ రాము తెలిపారు. షార్ట్ సర్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు అగ్నిమాపక శాఖ ప్రాథమికంగా నిర్ధారించింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.