సిటీబ్యూరో, జూన్ 20 (నమస్తే తెలంగాణ) :సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విధ్వంస ఘటనపై రైల్వే పోలీసులు నమోదు చేసిన కేసును నగర పోలీసులకు బదిలీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఈ కేసు దర్యాప్తులో నగర పోలీసులు తమ వంతు సహకారాన్ని రైల్వే పోలీసులకు అందిస్తున్నారు. ఈ ఘటనలతో సంబంధమున్న మరో 15 మందిని వివిధ ప్రాంతాల్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఈ ఘటనలో పాత్రదారులు, సూత్రదారులు ఎవరు అనే విషయంపై పోలీసులు ముమ్మర దర్యాప్తు జరుపుతున్నారు. డిఫెన్స్‌కు సంబంధించిన కోచింగ్ సెంటర్ల నిర్వాహకుల పాత్రపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆ దిశగా కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఘటన జరగడానికి ఒక రోజు ముందు అప్పటికే తయారు చేసుకున్న వాట్సాప్ గ్రూప్‌లలో జరిగిన సంభాషణలను పోలీసులు విశ్లేషిస్తున్నారు.
ఈ కేసుకు సంబంధించిన సీసీ కెమెరాలను పరిశీలించి నిందితులను గుర్తిస్తున్నారు. రిమాండ్ రిపోర్టులో మొత్తం 56 మందిని నిందితులుగా చేర్చారు. మొదటి పది మంది పరారీలో ఉన్నట్లు చూపించారు. వాట్సాప్ గ్రూప్ అడ్మిన్‌గా ఉన్న మధుసూదన్‌ను ప్రధాన నిందితుడిగా చేర్చారు. 8 వాట్సాప్ గ్రూప్‌లను పోలీసులు గుర్తించారు. కేసు దర్యాప్తు బాధ్యతను సిటీ పోలీసులకు అప్పగించేందుకు రైల్వే పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఉన్నతాధికారులతో చర్చిస్తున్నారు. కేసు బదిలీ అయితే డీజీపీ కార్యాలయం ద్వారా నగర పోలీస్ కమిషనరేట్‌కు ఈ కేసు చేరుతుంది. నగర పోలీసులకు దర్యాప్తు బాధ్యతలు అప్పగిస్తే, కేసు దర్యాప్తు బాధ్యతను సీసీఎస్ నేతృత్వంలోని సిట్‌కు అప్పగించే అవకాశాలున్నాయి.