ఉస్మానియా యూనివర్సిటీ, జూన్ 20: కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకాన్ని తక్షణమే రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన ఆందోళనలో మరణించిన రాకేశ్ మృతికి కారణమైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో నిరసన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎల్ మూర్తి మాట్లాడుతూ.. ఆర్మీ, సాయుధ బలగాల భర్తీని పాత పద్ధతిలోనే కొనసాగించాలన్నారు.
అగ్నిపథ్ పథకం పేరుతో నిరుద్యోగుల జీవితాలలో మట్టి కొట్టే నిర్ణయాలు విరమించుకోవాలని కేంద్రప్రభుత్వానికి సూచించారు. రైల్వే స్టేషన్లో నిరసన తెలుపుతున్న వారిపై లాఠీచార్జి, కాల్పులు జరపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. నేటి యువత, విద్యార్థులు రేపటి దేశ అభివృద్ధిలో కీలకమని, వారిపై ఫైరింగ్ ఆర్డర్ ఇచ్చిన అధికారులను తక్షణమే సస్పెండ్ చేసి, న్యాయ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. నిరసన తెలుపుతున్న ఎస్ఎఫ్ఐ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని ఓయూ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు రవినాయక్, శ్రీను, మమత, అనంత్శర్మ, పవన్, కృష్ణ, అనిల్, అశ్విని, మనోజ్, రాకేశ్, నజీర్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.