కాచిగూడ, జనవరి 31: నంబర్ ప్లేట్లు వంచుతూ.. వాహన నంబర్లు కనిపించకుండా స్టిక్కర్లు అంటిస్తూ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనదారులపై ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. ఇప్పటికే అనేకసార్లు ఈ అంశాలపై వాహనదారులకు అవగాహన కల్పించినా ఫలితం ఉండటం లేదు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిబంధనలు అతిక్రమిస్తున్న వారిని గుర్తిస్తూ చర్యలకు ఉపక్రమిస్తున్నారు. ఆదివారం రాత్రి కాచిగూడ టూరిస్ట్ చౌరస్తాలో కాచిగూడ పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో ఏపీ 11ఏఈ 4999 నంబర్ ద్విచక్ర వాహనంపై మిర్జా ఉస్మాన్బేగ్(31)అటువైపు వచ్చాడు. ‘ఏఈ’ అక్షరాలపై స్టిక్కర్ అతికించడాన్ని గుర్తించిన పోలీసులు ఆపి ప్రశ్నించారు. పొంతనలేని సమాధానాలు చెప్పడంతో బండిపై ఉన్న చలాన్లు పరిశీలించారు. పెండింగ్లో రూ.5,775 ఉన్నట్లు తేలగా వాహనాన్ని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు కాచిగూడ ఎస్సై సీహెచ్.మహేశ్ తెలిపారు.