బంజారాహిల్స్, జూన్ 19: ఖరీదైన కార్లను ఎవరూ ఆపరనే ధీమాతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న యజమానులకు ట్రాఫిక్ పోలీసులు షాక్ ఇచ్చారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో ప్రధాన రహదారులపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించి నిబంధనలు ఉల్లంఘిస్తున్న ఖరీదైన కార్ల యజమానులపై కొరడా ఝుళిపించారు. శనివారం నిర్వహించిన ఈ డ్రైవ్‌లో పలు ఉల్లంఘనలు బయటపడ్డాయి. బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో 5చోట్ల 109 హై ఎండ్ కార్లపై కేసులు నమోదయ్యాయి. అద్దాలకు బ్లాక్ ఫిలిమ్స్ కలిగి ఉన్న 35 కార్లకు, సరైన నంబర్ ప్లేట్ లేనివి 32, ఫ్యాన్సీ నంబర్ ప్లేట్లను వినియోగిస్తున్నవి 39, నంబర్ ప్లేట్ లేకుండా టీఆర్ నంబర్‌తో తిరుగుతున్న 3 కార్లకు చలాన్లు విధించారు. జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ పరిధిలో 139 హైఎండ్ కార్లకు ఫైన్ వేశారు. అద్దాలకు బ్లాక్ ఫిలిమ్స్ వేసిన 62 కార్లకు, సరైన నంబర్ ప్లేట్లు లేని 53, ఫ్యాన్సీ నంబర్ ప్లేట్లు కలిగి ఉన్నవి 20, టీఆర్ నంబర్‌తో నడుస్తున్న 4 కార్లకు జరిమానా వేశారు. వీటితో పాటు నిబంధనలు ఉల్లంఘించిన మరో 29 కార్లపై కూడా చర్యలు తీసుకున్నారు. రెండు ట్రాఫిక్ పోలీస్స్టేషన్ల పరిధిలో మొత్తం 276 కార్లపై జరిమానాలు విధించారు.
పెండింగ్ చలాన్లు చెల్లించిన ఎమ్మెల్యే దానం
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు ఉపయోగిస్తున్న కార్లకు సంబంధించిన పెండింగ్ చలాన్లను ఆదివారం చెల్లించారు. శనివారం బంజారాహిల్స్ రోడ్ నం. 14లో ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా ఎమ్మెల్యే దానం నాగేందర్ కుటుంబసభ్యులకు చెందిన బెంజ్ కారును పోలీసులు ఆపి తనిఖీలు చేశారు. ఎనిమిది చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయని గుర్తించారు. వెంటనే చెల్లిస్తామని వారు చెప్పడంతో కారును పంపించేశారు. ఈ విషయంపై మీడియాలో కథనాలు రావడంతో ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందించారు. ఐదు కార్లకు 66 చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయని గుర్తించి ఆదివారం ఉదయం రూ. 37,365లను ఆన్లైన్ ద్వారా చెల్లించారు. తమ కార్లపై ఉన్న జరిమానాలను చూసుకోలేదని, తన దృష్టికి వచ్చిన వెంటనే చెల్లించడంతో పాటు ఈ విషయాన్ని ట్రాఫిక్ పోలీసుల దృష్టికి తీసుకెళ్లినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.