ఖైరతాబాద్, జూన్ 19 : తిరుమలలో కూల్చిన అన్నమయ్య ఇంటిని అదే చోట పునర్నిర్మించాలని అన్నమయ్య కళాక్షేత్రం పీఠాధిపతి, సనాతన సమ ధర్మ ప్రచార పరిషత్ అధ్యక్షుడు విజయ శంకరస్వామి కోరారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తొలి వాగ్గేయకారుడు, పద కవితా పితామహుడు, మహా భక్తాగ్రేసరుడు, 32వేల అమృత సంకీర్తనలతో శ్రీ వేంకటేశ్వరుడిని అర్చించి తెలుగు భాషని సుసంపన్నం చేసిన అన్నమయ్య ఆనవాళ్లను కనుమరుగు చేశారన్నారు. 2003, 2007లో మాస్టర్ ప్లాన్ పేరిట తిరుమల తిరుపతి దేవస్థానం అపచారానికి పాల్పడిందని, వందల సంవత్సరాల చరిత్ర కలిగిన అన్నమయ్య గృహాన్ని కూల్చివేసిందన్నారు. కూల్చిన అన్నమయ్య గృహాన్ని నిర్మించడంతో పాటు ఆయన అర్చించిన ఆంజనేయస్వామి విగ్రహాన్ని యథాతథంగా ఏర్పాటు చేయాలన్నారు.
అన్నమయ్య గృహ పునర్నిర్మానమే లక్ష్యంగా ఏర్పాటైన అన్నమయ్య గృహ సాధన సమితి ఆవిర్భావ సభ ఈ నెల 28న సాయంత్రం 5గంటలకు తెలుగు విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో నిర్వహిస్తున్నామని తెలిపారు. అతిథులుగా చిల్కూరు బాలాజీ ప్రధానార్చకులు రంగరాజన్, బిర్లామందిర్ ప్రధానార్చకులు నరసింహాచార్యులు, గురుదేవా ట్రస్ట్ నిర్వాహకులు రాపర్తి జగదీశ్వర్‌తో పాటు అనేక మంది ప్రముఖులు హాజరవుతున్నారని చెప్పారు. అనంతరం సభకు సంబంధించిన కరపత్రాలను శృతి, స్మృతి సంస్థ వ్యవస్థాపకులు విశ్వనాథ శర్మ, చినుకుల కల్చరల్ సొసైటీ అధ్యక్షుడు పి. నరసింహ మూ ర్తి, సనాతన సమధర్మ ప్రచార పరిషత్ తెలంగాణ అధ్యక్షు డు భాగవతుల రామన్న, జైహో జాతీయ కార్యదర్శి మల్లి కా వల్లభ, కోవిద సహృదయ ఫౌండేషన్ అధ్యక్షురాలు డాక్టర్ జి. అనూహ్య రెడ్డితో కలిసి ఆవిష్కరించారు.