చిక్కడపల్లి, జూన్19: ప్రతి రోజు యోగా చేయడం ద్వారా వందేండ్లు జీవించవచ్చునని శాంతా బయోటెక్ అధినేత వరప్రసాద్‌రెడ్డి అన్నారు. యోగా నాచురల్ హీలింగ్ సెంటర్ ఆధ్వర్యంలో ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో యోగా మహా సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాంతా బయోటెక్ అధినేత, విభూషన్ డాక్టర్ కె.ఐ. వరప్రసాద్‌రెడ్డి హాజరై ప్రసంగించారు. ప్రతి రోజు యోగా చేయడంతో దీర్ఘకాలిక రోగాలు రావని తెలిపారు. హలోపతి వైద్యం కేవలం మూడు వందల సంవత్సరాల నుంచి మాత్రమే అందుబాటులో ఉన్నదని, యోగా మాత్రం అతి ప్రాచీణమైనదని అన్నారు. దీర్ఘకాలిక రోగాలకు హలోపతి ద్వారా తాత్కాలికంగా ఉపశమనం లభిస్తుందని, యోగా ద్వారా పూర్తిగా నయమవుతుందని తెలిపారు. ప్రతి రోజు యోగా చేయడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని అన్నారు. యోగాతో పాటు ప్రతి రోజు రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారం తీసుకోవాలని సూచించారు. యోగాను గ్రామీణ ప్రాంతాల ప్రజలకు కూడా అందుబాటులోకి తీసుకువెళ్లడంపై హీలింగ్ సెంటర్ వ్యవస్థాపకుడు కె.శివకృష్ణను అభినందించారు. ఈ కార్యక్రమంలో నమస్తే యోగా వ్యవస్థాపకుడు బిజ్జ్ భూషన్, చంద్రకాంత్, ఓం ప్రకాశ్, నిర్వాహక సెంటర్ వ్యస్థాపకులు కె.శివకృష్ణ, యోగా థెరపిస్ట్ కె.హరిత తదితరులు పాల్గొన్నారు.