చిక్కడపల్లి, జూన్19: ఉస్మానియా యూనివర్సిటీ, ఇతర యూనివర్సిటీల సహకారంతో జర్నలిస్టుల కోసం మీడియా అకాడమీ ఒక బ్రిడ్జి కోర్సును రూపొందిస్తున్నదని, ఇది ఒక సర్టిఫికెట్ కోర్సుగా ఉంటుందని మీడియా అకాడమీ రాష్ట్ర చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. శిక్షణా తరగతుల్లో నేర్చుకున్న అంశాలను ఆచరణలో పెట్టాలని ఆయన జర్నలిస్టులకు సూచించారు. బాగ్‌లింగంపల్లి ఆర్టీసీ కల్యాణ మండపంలో గ్రేటర్ హైదరాబాద్ జర్నలిస్టులకు మీడియా అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన రెండు రోజులు శిక్షణా తరగతులు ఆదివారం విజయవంతంగా ముగిశాయి. ఈ సందర్భంగా చైర్మన్ అల్లం నారాయణ మాట్లాడుతూ.. అకాడమీ ఆధ్వర్యంలో తొమ్మిది ఉమ్మడి జిల్లాలలో శిక్షణా తరగతులు నిర్వహించడం ద్వారా ఆరువేల మంది జర్నలిస్టులు లబ్ధిపొందారని తెలిపారు.
అదే విధంగా దళిత జర్నలిస్టుల శిక్షణా తరగతులు, మహిళా జర్నలిస్టుల శిక్షణా తరగతులు, గ్రేటర్ హైదరాబాద్ జర్నలిస్టుల శిక్షణా తరగతుల వల్ల మరో 1000 మంది లబ్ధిపొందినట్లు ఆయన పేర్కొన్నారు. అకాడమీ 12 పుస్తకాలు ప్రచురించి జర్నలిస్టులకు అందజేసినట్లు చెప్పారు. అకాడమీ కోసం నిర్మిస్తున్న నూతన భవనంలో ఒక ఆడిటోరియం, ఒక డిజిటల్ క్లాస్ రూమ్ ఉంటాయన్నారు. మరింత ఉపయోగకరంగా తరగతులు నిర్వహిస్తామని చెప్పారు.90 సంవత్సరాల సీనియర్ జర్నలిస్ట్, మహిళ విజయం మాస పత్రిక సంపాదకురాలు, వాసిరెడ్డి కాశీరత్నం చేతుల మీదుగా రెండు రోజుల శిక్షణా తరగతుల్లో పాల్గొన్న కొందరు జర్నలిస్టులకు సర్టిఫికెట్లు అందజేశారు.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పూర్వ చైర్మన్ ఘంటా చక్రపాణి, 6టీవీ శ్రీనివాస్‌రెడ్డి, టైమ్స్ ఆఫ్ ఇండియా జర్నలిస్టు సుధాకర్ రెడ్డి, జై తెలంగాణ టీవీ బుచ్చన్న పలు అంశాలపై ప్రసంగించారు. అదే విధంగా జర్నలిస్టుల సందేహాలకు ప్రతినిధులు సమాధానాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో అకాడమీ కార్యదర్శి నాగులపల్లి వెంకటేశ్వరరావు, టీయూడబ్ల్యూజే కార్యదర్శి మారుతీ సాగర్, టీయూడబ్ల్యూజే హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు యోగానంద్, కార్యదర్శి నవీన్ కుమార్, నాయకులు కట్ట కవిత పాల్గొన్నారు.