సిటీబ్యూరో, జూన్ 19 (నమస్తే తెలంగాణ): సీజన్ ఏదైనా నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరాయే లక్ష్యంగా దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ఎప్పటికప్పుడు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తున్నది. వేసవిలో డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్ సరఫరాను విజయవంతంగా అందించిన యంత్రాంగం, వర్షా కాలంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా విద్యుత్ సరఫరాను అందించేందుకు స్పెషల్ డ్రెవ్తో ముందుకు వెళ్తున్నారు.
కావాల్సినంత విద్యుత్, సరఫరా చేసేందుకు అవసరమైన మౌలిక వసతులు, క్షేత్ర స్థాయిలో ఉద్యోగులు ఉండటంతో ఇక అంతరాయాలకు చోటు లేకుండా డివిజన్లు, సెక్షన్ల వారీగా ప్రత్యేకంగా కంట్రోల్ రూంలను ఏర్పాటు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో వచ్చేందుకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో డిజాస్టర్ మేనేజ్మెంట్ బృందాలు అప్రమత్తంగా ఉన్నాయి. నిరంతరం క్షేత్ర స్థాయిలో ఎస్ఈ, డీఈ, ఏడీలు పర్యవేక్షణ చేస్తున్నారు. సెక్షన్ పరిధిలో ఉండే ఏఈలు స్థానికంగా ఉండే లైన్‌మన్, ఇన్స్పెక్టర్లతో కలిసి ప్రతి రోజూ క్షేత్ర స్థాయిలో పర్యటించి విద్యుత్ లైన్ల స్థితిగతులను తెలుసుకునేలా ఉన్నతాధికారులు ఆదేశించారు.
వర్షా కాలంలో అప్రమత్తంగా ఉండాలి..
వర్షా కాలంలో నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. చెట్లపై, రోడ్లపై, గృహాలపై విద్యుత్ తీగలు తెగి పడినట్టయితే వాటికి దూరంగా ఉండి, వెంటనే విద్యుత్ శాఖ దృష్టికి తీసుకువెళ్లాలన్నారు. రోడ్లపైన నిల్వ ఉన్న నీటిలో విద్యుత్ వైర్లు గానీ, ఇతర విద్యుత్ పరికరాలు గానీ మునిగి ఉన్నట్లయితే ఆ నీటిలోకి వెళ్లకూడదని హెచ్చరించారు.
ఫిర్యాదు కోసం ఫోన్ చేయండి..
విద్యుత్‌కు సంబంధించి ఎలాంటి అత్యవసర పరిస్థితి ఉన్నా 192/100/ స్థానిక ఫ్యూజ్ ఆఫ్ కాల్ ఆఫీస్‌తో పాటు విద్యుత్ శాఖ ప్రత్యేక కంట్రోల్ రూమ్ నం: 7382072104, 7382072106,7382071574 ఫోన్ నంబర్లకు ఫిర్యాదులు చేయవచ్చని సీఎండీ జి.రఘుమారెడ్డి తెలిపారు. అదేవిధంగా, సంస్థకు చెందిన మొబైల్ యాప్, వెబ్సైట్, ట్విట్టర్, ఫేస్బుక్ ద్వారా సైతం విద్యుత్ సమస్యలు సంస్థ దృష్టికి తీసుకురావచ్చని సూచించారు.