హైదరాబాద్, జూన్ 19 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లో పర్యటిస్తున్న ఆసియా దేశాల జర్నలిస్టులు నగరంలోని పలు సంస్థలను సందర్శించారు. ‘ఆసియా-ఇండియా మీడియా ఎక్ఛ్సేంజి’లో భాగంగా పది ఆసియా దేశాల నుంచి 20 మంది జర్నలిస్టులు ఈ నెల 14 నుంచి భారత్‌లో పర్యటిస్తున్నారు. శనివారం సాయంత్రం హైదరాబాద్‌కు చేరుకున్న ప్రతినిధుల బృందం.. ఆదివారం ఆదిభట్లలోని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), శామీర్‌పేటలోని భారత్ బయోటెక్, గచ్చిబౌలిలోని టీ-హబ్‌లను సందర్శించింది. హైదరాబాద్‌లో ఐటీ, పారిశ్రామిక రంగాల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలపై ఆసియా దేశాల జర్నలిస్టులు ఆసక్తిని కనబర్చారు. అంతర్జాతీయ స్థాయిలో టీసీఎస్ అందిస్తున్న ఐటీ సేవలను అడిగి తెలుసుకున్నారు. ఫార్మారంగంలో హైదరాబాద్ సాధిస్తున్న విజయాలను, కొవిడ్ వ్యాక్సిన్ కోసం భారత్ బయోటెక్ చేసిన కృషిని తెలుసుకొని వారు హర్షం వ్యక్తం చేశారు.
టీ-హబ్‌లో..
గచ్చిబౌలిలోని టెక్నాలజీ -హబ్‌ను ఆసియా జర్నలిస్టుల బృందం ఆదివారం సాయంత్రం సందర్శించింది. స్టార్టప్‌ల తీరు, టెక్నాలజీ ఇన్నోవేటివ్, వర్చ్యువల్ సొల్యూషన్స్, మారెటింగ్, ఎకో సిస్టం, ప్రపంచ టెక్నాలజీ అభివృద్ధి సంస్థలతో కలిసి పనిచేస్తున్న తీరును టీ-హబ్ వైస్ ప్రెసిడెంట్ పన్నీర్ సెల్వం వారికి వివరించారు. టీ-హబ్ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నదని, దీన్ని పలు రాష్ర్టాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయని తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద టెక్నాలజీ ఇన్నోవేషన్ సెంటర్‌గా టీ-హబ్ త్వరలోనే రూపుదిద్దుకోనున్నదని తెలిపారు. టీ-హబ్‌లోని వివిధ ఇన్నోవేటివ్ విభాగాల గురించి టీ-హబ్ సీనియర్ బిజినెస్ ప్రోగ్రాం మేనేజర్ ప్రియాంక వివరించారు.