అబిడ్స్, జూన్ 19 : దంత వైద్యం ఎంతో ఖరీదైనది. దంతాలు పీకాలన్నా, ఇంప్లాంట్ చేయాలన్నా ఎంతో ఖర్చుతో కూడుకున్నది. నగరంలో దంత పరీక్షలు, వైద్యం చేయించుకోవాలంటే ఉస్మానియా దంత కళాశాలలో మాత్రమే ఉచితంగా అందిస్తారు. మిగతా ప్రైవేట్ దవాఖానల్లో దంత వైద్యం పొందాలంటే జేబులు గుల్ల చేసుకోవాల్సిందే. అయితే ఉస్మానియా దంత వైద్య కళాశాలలో విద్యను పూర్తి చేసుకున్న డాక్టర్ సునీల్ కుమార్, ఆయన భార్య డాక్టర్ శ్రీదేవి పేదలు పడుతున్న ఇబ్బందులను గుర్తించి అతితక్కువ ఖర్చుతో, పేదలకు సరసమైన ధరకే అన్ని రకాల దంతవైద్య సేవలు అందించాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడవుగా నగరంలోని మూడు ప్రాంతాల్లో ఏరియా డెంటల్ చారిటబుల్ హాస్పిటల్ బ్రాంచ్‌లను ఏర్పాటు చేశారు. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ నుంచి మొదలుకొని నూతన దంతాలను అమర్చడం, పుచ్చిపోయిన దంతాలను తొలగించడం వంటి వైద్య సేవలను అందిస్తున్నారు. ఆహార భద్రత కార్డు ఉన్న వారికి మరింత తక్కువ ధరకే వైద్యం చేస్తున్నారు. త్వరలోనే మరిన్ని బ్రాంచ్‌లను ఏర్పాటు చేయనున్నట్లు డాక్టర్ సునీల్ కుమార్ తెలిపారు.
2012లో మొదలై.!
హనుమాన్ టేక్డీలో 2012లో ఏరియా డెంటల్ చారిటబుల్ హాస్పిటల్‌ను ఏర్పాటు చేశారు. తర్వాత నగరంలోని సంతోష్‌నగర్, మెహిదీపట్నంలో బ్రాంచ్‌లను స్థాపించి అత్యాధునిక యంత్రాల ద్వారా వైద్య సేవలు అందజేస్తున్నారు. హనుమాన్ టేక్డీలోని దవాఖానలో ప్రతి నిత్యం వంద మందికి పైగా దంత వైద్యులు పనిచేస్తున్నారు.
రూట్ కెనాల్ రూ.300
రూట్ కెనాల్ ట్రీట్ మెంట్‌కు ప్రైవేటులో దాదాపు రూ.మూడు నుంచి ఐదు వేలవరకు చార్జి చేస్తుంటారు. ఇక్కడ కేవలం రూ.300లకే చేస్తున్నారు. అదేవిధంగా దంతాలను అమర్చాలంటే బయట వేల ఖర్చు అవుతుండగా ఇక్కడ కేవలం రూ.500లతో పూర్తి స్థాయి వైద్యం అందజేస్తున్నారు. అంతేకాకుండా దంతాల ఎక్స్‌రే, దంతాల సిటీ స్కాన్, సీబీసీటీ వంటి దంత పరీక్షలు కూడా అత్యాధునిక యంత్రాల ద్వారా అతి తక్కువ ధరకే నిర్వహిస్తున్నారు.