మియాపూర్, జూన్ 19 : ప్రభుత్వ పాఠశాలల పురోగతికి ప్రభుత్వం విశేష కృషి చేస్తున్నదని విప్ అరెకపూడి గాంధీ అన్నారు. ప్రభుత్వానికి తోడు దాతలు కార్పొరేట్ కంపెనీలు సామాజిక బాధ్యతతో తోడ్పాటును అందిస్తుండటం అభినందనీయమన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం వివేకానందనగర్ డివిజన్ పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సినాప్సిస్ ఇండియా సౌజన్యంతో నిర్మాణ్ ఆర్గనైజేషన్ సంస్థ ఆధ్వర్యంలో రూ. 11.45 లక్షలతో ఏర్పాటు చేసిన సోలార్ ప్లాంట్, ఫ్లోరింగ్, 100 బెంచీలు, తాగునీటి ఫిల్టర్, తలుపులు కిటికీల మరమ్మతులు, నీటి సంపులను ఆ సంస్థ ఇండియా కమ్యూనికేషన్ రిలేషన్స్ మేనేజర్ నర్సింహ, డైరెక్టర్ నరేంద్ర, ఫౌండర్ మయూర్ పట్నాల, అనురాధ, కార్పొరేటర్ మాధవరం రోజాదేవిలతో కలిసి విప్ గాంధీ ఆదివారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా విప్ గాంధీ మాట్లాడుతూ.. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద నిరుపేద విద్యార్థులు చదువుకునే సర్కారు పాఠశాలను ఎంచుకుని పూర్తి స్థాయి వసతులను కల్పించటం గొప్ప విషయమని అన్నారు. మిగిలిన సంస్థలు సైతం ఈ తరహా సేవలను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. దాతలు అందిస్తున్న సేవలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని, కష్టపడి చదవి ఉన్నత భవిష్యత్‌ను పొందాలని గాంధీ ఆకాంక్షించారు. ‘మన ఊరు మన బడి’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల కల్పనకు ప్రభుత్వం సైతం కోట్లాది రూపాయలను వెచ్చిస్తున్నదని, ప్రతి రూపాయిని సద్వినియోగపరిచి వసతులను కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు, పార్టీ నేతలు సంజీవరెడ్డి, పెద్ద భాస్కర్‌రావు, చంద్రకాంత్‌రావు, భగవాన్, దర్శన్, హరినాథ్, రామచంద్రరావు, బాబు, శ్రావణిరెడ్డి, ముని, ఈశ్వర్రావు, కొండల్రావు, అనీల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
సాయిబాబా ఆలయంలో పూజలు
ఆల్విన్ కాలనీ డివిజన్ దత్తాత్రేయ కాలనీలో సాయిబాబా దేవాలయ 11వ వార్షికోత్సవంలో కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్‌తో కలిసి విప్ గాంధీ పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన ప్రత్యేక పూజాదికాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చంద్రకాంత్‌రావు, జగదీశ్, సత్యనారాయణ, రఘునాథ్, నిరంజన్‌గౌడ్, అశోక్, శంకర్ గౌడ్, మధుసూధన్‌రెడ్డి, రాంచందర్, మురళీకృష్ణ, శ్రీదేవి, శశికళ, నాగమణి, మురళీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.