కేపీహెచ్‌బీ కాలనీ, జూన్ 19 : గ్రామదేవత చిత్తారమ్మ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తెలిపారు. ఆదివారం చిత్తారమ్మ దేవాలయంలో కల్యాణ మండపం షెడ్లు, వంటశాలను ఎమ్మెల్యే కృష్ణారావు, ఎమ్మెల్సీలు కుర్మయ్యగారి నవీన్‌కుమార్, శంభీపూర్ రాజులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కూకట్‌పల్లిలో ఎన్నో ఏండ్ల చరిత్ర కలిగిన గ్రామదేవత చిత్తారమ్మ ఆలయాన్ని అత్యద్భుతంగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. దేవాలయాల చరిత్రను భావితరాలకు పదిలంగా అందించాలన్న ఉద్దేశంతో ఆలయాలను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే 436 ఏండ్ల చరిత్ర కలిగిన రామాలయాన్ని పునరుద్ధరించామని ఇదే తరహాలో చిత్తారమ్మ ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.
చిత్తారమ్మ దేవాలయ అభివృద్ధికి సహకరించిన ఎమ్మెల్సీలు నవీన్‌కుమార్, శంభీపూర్ రాజులతో పాటు కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ, గొట్టిముక్కల పెదభాస్కర్రావును అభినందించారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు మాధవరం రోజాదేవి, దొడ్ల వెంకటేశ్ గౌడ్, ఆలయ కమిటీ చైర్మన్ తులసీరావు, మాజీ కార్పొరేటర్ రంగారావు, భక్తులు పాల్గొన్నారు.