సిటీబ్యూరో, జూన్ 17 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ కేంద్రంగా డ్రోన్ రంగంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న స్టార్టప్ కంపెనీకి మంచి అవకాశం దక్కింది. డ్రోన్ల ద్వారా అటవీ ప్రాంతాల్లో విత్తనాలు (సీడ్ బాల్) వెదజల్లే కార్యక్రమాన్ని ఏడు రాష్ర్టాల్లో చేపట్టేందుకు అనుమతి వచ్చింది. ఇందుకు సంబంధించిన బ్రోచర్‌ను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియా ఇటీవల ఆవిష్కరించారని మారుత్ డ్రోన్స్ స్టార్టప్ వ్యవస్థాపకుడు ప్రేమ్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రేమ్ మాట్లాడుతూ ఇప్పటికే తెలంగాణలో హరబరా పేరుతో డ్రోన్ల ద్వారా అటవీ ప్రాంతాల్లో సీడ్ బాల్స్ వెదజల్లే కార్యక్రమాన్ని విజయవంతంగా చేపట్టామని, దాన్ని పరిశీలించిన తర్వాతనే కేంద్రం దేశంలోని ఇతర రాష్ర్టాల్లోని అటవీ ప్రాంతాల్లో సీడ్ బాల్స్‌ను డ్రోన్ల ద్వారా వెదజల్లేందుకు అనుమతి ఇచ్చిందని పేర్కొన్నారు. ఈ జాబితాలో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, అస్సాం, అరుణాచల్‌ప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్ రాష్ర్టాలు ఉన్నాయని తెలిపారు.
సీడ్ బాల్స్ తయారీలో మహిళలు
డ్రోన్ల ద్వారా అడవుల్లో విత్తనాలు (సీడ్‌బాల్స్) వెదజల్లే కార్యక్రమంలో 15వేల మందికి పైగా మహిళల భాగస్వామ్యం ఉందని మారుత్ డ్రోన్స్ వ్యవస్థాపకులు ప్రేమ్ తెలిపారు. అటవీ ప్రాంతాల్లో హరబరా కార్యక్రమాన్ని నిర్వహించేందుకు మొదట విత్తనాలను సీడ్ బాల్స్‌గా తయారుచేసే పనిని స్వయం సహాయ సంఘాలకు అప్పగించామని, దీని ద్వారా వేలాది మందికి ఉపాధి కల్పించామని పేర్కొన్నారు. మహిళలు తయారుచేసిన సీడ్ బాల్స్‌ను సీడ్ కాప్టర్ (డ్రోన్) ద్వారా ఎంపిక చేసిన అటవీ ప్రాంతాల్లో వెదజల్లనున్నట్లు చెప్పారు. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో దశల వారీగా ఆయా రాష్ర్టాల్లో అక్కడి అటవీ శాఖ అనుమతితో డ్రోన్ల ద్వారా సీడ్ బాల్స్ వెదజల్లే కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు.