సిటీబ్యూరో, జూన్ 17 ( నమస్తే తెలంగాణ ): సరైన శిక్షణ లేకుండా వాహనాలు నడుపుతూ.. ప్రమాదాలకు కారణమవుతున్నారు కొంతమంది వాహనదారులు. ప్రతి ఏడాది కొత్తగా డ్రైవింగ్ నేర్చుకుని వాహనాలు నడుపుతున్న వారు 35శాతం మంది ఉంటారని రవాణ శాఖ లెక్కలు చెబుతున్నాయి. వీరిలో చాలా వరకు సరైన శిక్షణ లేకుండా అరకొర డ్రైవింగ్‌తో వాహనాలు నడుపుతూ ప్రాణాల మీదకు తెచ్చుకోవడంతో పాటు ఇతరుల ప్రాణాలను రిస్క్‌లో పెడుతున్నారు. డ్రైవింగ్ నేర్పాల్సిన మోటార్ డ్రైవింగ్ స్కూల్స్ నిర్వాహకులు వీలైనంత తక్కువ వ్యవధిలో తూతూ మంత్రంగా శిక్షణ ముగించేసి, రూ.5వేల నుంచి 6 వేల వరకు వసూలు చేస్తూ.. లైసెన్స్ ఇప్పిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రవాణ అధికారుల ఆధ్వర్యంలో నడుస్తున్న డ్రైవింగ్ స్కూల్స్‌పై సరైన పర్యవేక్షణ లేకపోవడంతో ప్రమాదాలు ఏటా పెరుగుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అవగాహన లేకపోవడంతోనే ప్రమాదాలు
నగరంలో సగటున రోజుకు చిన్నాపెద్ద కలిపి సుమారు 20 ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. రోజుకు ఒకరిద్దరు చనిపోతున్నారు. శివార్లలో నిత్యం పదుల సంఖ్యలో ప్రమాదాలు జరుగుతుంటే ఇద్దరు చనిపోతున్నారు. 90 శాతం ప్రమాదాలకు మానవ తప్పిదాలే కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం, అధిక వేగం, అడ్డదిడ్డంగా వాహనాలు నడపడం, జాతీయ రహదారులపై ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా వాహనాలు ఆపడం తదితర కారణాల వల్ల ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. సరైన శిక్షణ, అవగాహన లేకపోవడం, ట్రాఫిక్ నిబంధనలు తెలియకపోవడంతో అంతిమంగా ప్రమాదాలకు కారణమవుతున్నారు.
ఆర్టీఏ చట్టాలపై అవగాహన..!!
కారు లేదా ఇతర లైట్‌వేట్ మోటార్ వెహికల్ నడపాలంటే కనీసం 21 రోజుల పాటు శిక్షణ అవసరం. ఇందుకు డ్రైవింగ్ స్కూల్‌కు వెళ్లి నేర్చుకోవాల్సి ఉంటుంది. ఎస్కలేటర్, బ్రేక్, క్లచ్‌పై అవగాహన కల్పిస్తారు. గేర్లు ఎలా మార్చాలి, గేర్లు మార్చే విధానంపై శిక్షణ ఉంటుంది. ట్రాఫిక్‌లో వాహనం నడిపే విధానం, ఎదుటి వాహనాన్ని దాటేసేటప్పుడు సిగ్నల్స్ వద్ద ఆగడం. ఇలా ఏ సమయాల్లో ఏ గేరులో ఉండాలో సిమ్యులేటర్‌పై ట్రెయినర్స్ వివరిస్తారు. సిమ్యులేటర్‌పై శిక్షణ ఇస్తూనే అవగాహన తరగతులు నిర్వహిస్తారు. ఇందులో ట్రాఫిక్ నిబంధనలు, సూచనలు, ఆర్టీఏ చట్టాల గురించి వివరిస్తారు. ఆ తర్వాతే క్షేత్రస్థాయిలో వాహనం నడపడంపై అవగాహన ఉంటుంది. పక్కనే శిక్షకుడు ఉంటూ వాహనం నడపడం నేర్పుతారు. వాహనం నడపటానికి ముందు ఆర్టీఏ కార్యాలయంలో లైట్ మోటార్ వెహికల్ నడిపేందుకు కావాల్సిన ఎల్ఎల్ఆర్ తీసుకోవాలి. అది ఉంటే శిక్షణ వాహనం నడిపేందుకు అవకాశం ఉంటుంది. శిక్షణ పూర్తైన తర్వాత శాశ్వత లైసెన్స్ అందిస్తారు. కానీ ఈ నిబంధనలను చాలా డ్రైవింగ్ స్కూల్స్ పాటించడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
డబ్బులు లాగడానికే శిక్షణనా?
నగరంలో గుర్తింపు లేని డ్రైవింగ్ స్కూళ్ల కారణంగా ఎక్కువ మంది అరకొర శిక్షణతో బయటకొస్తున్నారు. ఆర్టీఏ కార్యాలయాల చుట్టూ పదుల సంఖ్యలో డ్రైవింగ్ స్కూళ్లు ఏర్పాటవుతున్నాయి. వీటిలోనూ ఎలాంటి సిమ్యులేటర్లు లేవు. బండ్లగూడ ఆర్టీఏ పరిధిలో ఉన్న డ్రైవింగ్ స్కూల్స్‌పై ఆర్టీఏ అధికారులు ఎలాంటి దృష్టి సారించడం లేదు. రూ.6వేల పైనే వసూలు చేస్తూ లైసెన్స్ ఇప్పిస్తున్నారు. కానీ అది ప్రమాదాలకు కారణమవుతుందని ఆలోచించాలి.
-సత్తిరెడ్డి, ఆటో యూనియన్ నాయకుడు
పది రోజుల్లో లైసెన్స్
డ్రైవింగ్ స్కూల్స్‌పై అధికారుల పర్యవేక్షణ లేదు. కనీసం థియరీ క్లాసుల జోలికే వెళ్లరు. రెండు, మూడు సూచనలు చేసి వాహనం చేతికిస్తున్నారు. గ్రౌండ్లో రెండు మూడు చక్కర్లు కొట్టి శిక్షణ పూర్తయిందని చెప్పేస్తున్నారు. లైసెన్స్ ఇప్పించే బాధ్యత తమదని డబ్బులు గుంజుతున్నారు. ఆర్టీఏ కార్యాలయ దళారులు అధికారులతో ఉన్న సంబంధాలతో లైసెన్స్ ఇప్పిస్తున్నారు. వాస్తవానికి డ్రైవింగ్ స్కూల్ నిర్వహించడానికి రవాణాశాఖ అనుమతి తప్పనిసరి. నగరంలో 80శాతం డ్రైవింగ్ స్కూళ్లకు ఎలాంటి అనుమతులు లేవు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి కూడా గండిపడుతున్నది.
-వేముల మారయ్య, టీఆర్ఎస్కేవీ, రాష్ట్ర ఆటో యూనియన్ అధ్యక్షుడు