సికింద్రాబాద్, జూన్ 15: అంతర్జాతీయ స్థాయి అతిపెద్ద అధునాతన మార్కెట్‌ను కోహెడలో నిర్మిస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. మార్కెట్లో ప్రమాణాలు బాగుంటే రైతులు ఉత్పత్తులను ఎక్కడి నుంచైనా తీసుకువచ్చి అమ్ముకుంటారని పేర్కొన్నారు. ఈ మేరకు మార్కెటింగ్ శాఖలో తొలిసారి ప్రతిభ కనబరచిన 10 విభాగాల నుంచి 43 మంది ఉద్యోగులకు బుధవారం బోయిన్పల్లి మార్కెట్లో మంత్రి నిరంజన్‌రెడ్డి అవార్డులను అందించారు. మూడు అవార్డులు గెలుచుకున్న సూపరింటెండెంట్ ఫర్హానాను ప్రత్యేకంగా అభినందించారు.
ఈ సందర్భంగా మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగులలో స్ఫూర్తి నింపేందుకే అవార్డులను అందజేస్తున్నామన్నారు. రైతులు పం డించిన పంటలు కొనే మార్కెటింగ్ శాఖ అద్భుతంగా పనిచేస్తేనే, వ్యవసాయం విస్తరణ జరిగి, పంటలసాగు పెరిగి, గణనీయంగా ఉత్పత్తులు మా ర్కెట్‌కు తరలివస్తాయని మంత్రి సూచించారు. కరోనా సమయంలోనూ మార్కెటింగ్ శాఖ ఇండ్ల వద్దకే కూరగాయలు, పండ్లు రవాణా చేసి సామాన్యులకు నిత్యావసరాలు అందుబాటులో ఉంచిందని మంత్రి నిరంజన్‌రెడ్డి గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ ఈ విషయం తెలుసుకుని అభినందించారని చెప్పారు. మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్లను సమర్థవంతంగా నిర్వహించడంపై దృష్టిసారించాలన్నారు. కార్యక్రమంలో మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి, అడిషనల్ డైరెక్టర్లు లక్ష్మణుడు, రవికుమార్, ఎస్ఈ రాధాకృష్ణ మూర్తి, ఉద్యోగ సంఘాల నాయకులు చిలక నర్సింహారెడ్డి, రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.