అమీర్పేట్, జూన్ 14 : మహిళలు ఉత్పత్తి చేసిన పర్యావరణహిత ఉత్పత్తులు అమీర్పేట్ మెట్రోస్టేషన్ కాన్కోర్స్ లెవెల్లో కొలువుదీరాయి. ‘మెట్రో బజార్’ పేరుతో ఉమెన్ విజన్ సంస్థ ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న పలు ఉత్పత్తుల అమ్మకాలకు ఇక్కడి 14 స్టాళ్ల ద్వారా 15 రోజుల పాటు అమ్మకాలు చేపడుతున్నారు. అమీర్పేట్ మెట్రోస్టేషన్ కాన్కోర్ లెవెల్లో బుధవారం ఏర్పాటు చేసిన ‘మెట్రో బజార్’ మొదటి ఎడిషన్ను మహిళా రక్షణ విభాగం అదనపు డీజీ స్వాతి లక్రా ముఖ్యఅతిథిగా విచ్చేసి హెచ్ఎంఆర్ఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, ఎల్అండ్టీ హెచ్ఎంఆర్ఎల్ ఎండీ సీఈవో కేవీబీ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా అదనపు డీజీ స్వాతి లక్రా ‘మెట్రో బజార్’లో ఏర్పాటు చేసిన స్టాళ్లను ఆద్యంతం ఆసక్తిగా తిలకించారు.