సిటీబ్యూరో, జూన్ 15 (నమస్తే తెలంగాణ ): ప్రజా సమస్యలను పరిష్కరించడమే పట్టణ ప్రగతి ముఖ్య ఉద్దేశ్యమని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, జిల్లా కలెక్టర్ శర్మన్‌తో కలిసి బుధవారం ఎన్బీటీ శ్రీరామ్‌నగర్ బస్తీలో మేయర్ పర్యటించారు. ఈ సందర్భంగా మేయర్ విజయలక్ష్మి మాట్లాడుతూ పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నగరవాసులు సద్వినియోగం చేసుకుంటున్నారని, తమ సమస్యలను ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకురావడంతో అకడికకడే పరిషారం అవుతున్నాయని తెలిపారు. ఎస్ఎన్డీపీ కింద మంజూరైన వెయ్యి కోట్లతో గత సంవత్సరం వరదలకు గురైన ఎల్బీనగర్, ఉప్పల్, చార్మినార్ ప్రాంతాల్లో రిటైనింగ్ వాల్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.
వరదల వల్ల ఎలాంటి ప్రమాదాలు జరుగకుండా ముందస్తుగా నాలాలకు ఫెన్సింగ్, ప్రమాద సూచికలు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా జోనల్ వారీగా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంతో పాటు జోనల్ కార్యాలయంలో హెల్ఫ్‌లైన్ నంబర్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జీహెచ్ఎంసీ ద్వారా స్టాటిక్, ఎమర్జెన్సీ బృందాలు 24గంటలు పని చేస్తున్నాయని చెప్పారు. అనంతరం ఎన్బీటీ కాలనీలోని ప్రభుత్వ పాఠశాలలో రాజ్యసభ సభ్యులు కేశవరావు తన ఎంపీ నిధుల్లోంచి రూ.20 లక్షల వ్యయంతో చేపట్టనున్న రెండు అదనపు తరగతి గదుల నిర్మాణానికి భూమి పూజ చేశారు. అదేవిధంగా శ్రీరాంనగర్ బస్తీలో కమ్యూనిటీ హాల్ కోసం ప్రభుత్వ భూమిని కేటాయించాలని కలెక్టర్‌ను కోరారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ రవికిరణ్, ఆర్డీఓ వసంత, డిప్యూటీ కమిషనర్, తాసీల్దార్ రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.