ఎల్బీనగర్, జూన్ 14: వానకాలంలో వచ్చే వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్త సూచించారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా కొత్తపేట, చైతన్యపురి డివిజన్ల పరిధి మూసీ పరీవాహక ప్రాంతాల్లో దోమల నివారణపై అవగాహన కార్యక్రమంతో పాటు క్లీనింగ్ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణ ప్రగతి కార్యక్రమంలో పారిశుధ్య పనులతో పాటు పచ్చదనాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తున్నారని అన్నారు. దోమల నివారణ చర్యలు కూడా పట్టణ ప్రగతిలో తీసుకోవడం జరుగుతుందన్నారు. దోమకాటుతో వచ్చే డెంగీ వ్యాధి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ ప్రతినిధులు పులికంటి వెంకట్, ఎస్ఎఫ్ఏ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారం..
మన్సూరాబాద్, జూన్ 14: పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా తమ దృష్టికి వచ్చిన ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరిస్తున్నామని హయత్నగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ మారుతీ దివాకర్ తెలిపారు. మన్సూరాబాద్ డివిజన్ సరస్వతినగర్, నాగోల్ డివిజన్ అరుణోదయనగర్ కాలనీలో నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొన్ని రోజులుగా రోడ్లకు ఇరువైపులా పేరుకుపోయిన చెత్తా చెదారంతో పాటు పురాతన భవనాల శిథిలాల వ్యర్థాలను తొలగింపజేస్తున్నట్లు తెలిపారు.
సమస్యల పరిష్కారానికి కృషి
సైదాబాద్, జూన్ 14 : కాలనీవాసుల సమస్యలు పరిష్కరించటానికి చర్యలు తీసుకుంటున్నామని సైదాబాద్ కార్పొరేటర్ కొత్తకాపు అరుణ అన్నారు. మాధవనగర్ కాలనీలో మంగళవారం కార్పొరేటర్ జలమండలి అధికారులతో కలిసి పర్యటించారు. కార్యక్రమంలో సైదాబాద్ సెక్షన్ జలమండలి మేనేజర్ శ్రవణ్, వర్క్ ఇన్స్పెక్టర్ మనోహర్ పాల్గొన్నారు.
తాగునీటి ఇబ్బందులు లేకుండా..
మలక్పేట, జూన్ 14 : తాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటానని కార్పొరేటర్ భాగ్యలక్ష్మి అన్నారు. మూసారాంబాగ్ డివిజన్ పరిధిలోని రామాలయం టెంపుల్ సమీపంలో కాలనీవాసులు కార్పొరేటర్నకు నీరు కలుషితం అవుతున్నదని సమస్యను పరిష్కరించాలని విన్నవించారు. మంగళవారం జలమండలి సిబ్బందితో కలిసి వచ్చి పనులను పరిశీలించారు. కార్యక్రమంలో జలమండలి మేనేజర్ చందు, బస్తీవాసులు వీరేశ్, శ్యామ్, శ్రీకాంత్, సచిన్, దినేశ్ పాల్గొన్నారు.