సిటీబ్యూరో, జూన్ 14 (నమస్తేతెలంగాణ) : గ్రూప్-1, గ్రూప్-2 పోలీసు ఉద్యోగాల కోసం చదివే వారితోపాటు వివిధ యూనివర్సిటీలలో పరిశోధన చేస్తున్న విద్యార్థులకు ‘తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖచిత్రం-2022’ పుస్తకం ఎంతో దోహదం చేస్తుందని జిల్లా కలెక్టర్ శర్మన్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని తన కార్యాలయంలో జిల్లా ప్లానింగ్ అధికారితో కలిసి ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు.
కలెక్టర్ మాట్లాడుతూ ఈ పుస్తకం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల శాఖల సమాచారం ఆధారంగా రూపొందించారని, ఈ పుస్తకాలు జిల్లా కలెక్టరేట్లోని ప్లానింగ్ అధికారి కార్యాలయంతోపాటు ఖైరతాబాద్‌లోని గణాంకభవన్‌లో అందుబాటులో ఉన్నాయని, ఒక్కోటి రూ.150 చెల్లించి కొనుగోలు చేయాలన్నారు. సాప్ట్‌కాపీ కావాలంటే www.ecostat.telangana.gov.in వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. కార్యక్రమంలో జిల్లా ముఖ్య ప్రణాళికా అధికారి నరేందర్, డీపీఆర్వో భానుప్రకాశ్, జిల్లా గణాంకాధికారి రెడ్డప్ప, సీనియర్ అసిస్టెంట్ కిశోర్ తదితరులు పాల్గొన్నారు.