సిటీబ్యూరో,జూన్ 14(నమస్తే తెలంగాణ): పాఠశాలలు ప్రారంభమైన నేపథ్యంలో స్కూల్ బస్సులు, వ్యాన్ డ్రైవర్లు కచ్చితంగా అర్హత కలిగిన డ్రైవింగ్ లైసెన్స్ ఉంటేనే వాటిని నడిపించాలని సైబరాబాద్ ట్రాఫిక్ అదనపు డీసీపీ శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. అదే విధంగా స్కూల్ యాజమాన్యాలు ఆరోగ్యవంతులైన వారిని మాత్రమే డ్రైవర్లుగా నియమించుకోవాలని సూచించారు. వృద్ధులను, కంటి చూపు సరిగా లేనివారిని నియమించుకోవద్దని హెచ్చరించారు. విద్యార్థుల సురక్షిత ప్రయాణం కోసం సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక కార్యాచరణను రూపొందించుకున్నారు. విద్యార్థులను తీసుకువెళ్తున్న వాహనాలు కండీషన్లో ఉంచాలని యాజమాన్యాలకు సూచించారు. విద్యార్థులు బస్సులు ఎక్కే సమయంలో, దిగే సమయంలో జాగ్రత్తలు పాటించాలన్నారు.
విద్యార్థులు రోడ్డు దాడుతున్న సమయంలో ట్రాఫిక్ పోలీసుల సహాయం తీసుకోవాలని సూచించారు. విద్యార్థుల భద్రత విషయంలో ప్రత్యేక డ్రైవ్‌ను నిర్వహిస్తామన్నారు. లోపాలు కనబడితే యాజమాన్యాలపై చట్టపరమైన చర్యలు ఉంటాయని అదనపు డీసీపీ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. అదేవిధంగా.. విద్యార్థులను తీసుకువెళ్లే ఆటో డ్రైవర్లకు డ్రైవి ంగ్ లైసెన్సులు తప్పనిసరిగా ఉండాలన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఆటోలలో విద్యార్థులను తీసుకువెళ్లడం క్షేమం కాదన్నారు. వాహనాలు నడిపించే సమయంలో సెల్‌ఫోన్ మాట్లాడవద్దని హెచ్చరించారు.
ఫీజుల వసూల్లో కఠినం..
సిటీబ్యూరో, జూన్ 14 ( నమస్తే తెలంగాణ): చిన్నారుల భద్రతను పాఠశాలల యాజమాన్యాలు గాలికొదిలేస్తున్నాయి. ఫీజుల విషయంలో నిక్కచ్చిగా వసూలు చేసే యాజమాన్యాలు.. పిల్లలను తీసుకెళ్లే బస్సుల ఫిట్నెస్ విషయాన్ని మాత్రం పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. ఒకేరోజు మంగళవారం 58 స్కూల్ బస్సులు సీజ్ చేసినట్టు రవాణా శాఖ అధికారులు తెలిపారు. రంగారెడ్డిలో 35, మేడ్చల్‌లో 8, హైదరాబాద్‌లో 15 స్కూల్ బస్సులను సీజ్ చేశారు. గ్రేటర్లో 11వేలకు పైగా స్కూల్ బస్సులు నడుస్తున్నాయి. ఇప్పటికీ సుమారు ఐదు వేలకు పైగా బస్సులు ఫిట్‌నెస్‌కు రాలేదు. వీటిలో ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా ఉన్నాయి.
చాలా వరకు బస్సుల యాజమాన్యాలు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్(ఆర్సీ), 2. వ్యాలీడ్ ఇన్సూరెన్స్ సర్టిఫికెట్, 3. వ్యాలీడ్ ఫిట్నెస్ సర్టిఫికెట్, 4. పర్మిట్, 5. ట్యాక్స్ పేమెంట్ రశీదు(బకాయిలు లేకుండా), 6. పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికెట్, 7. డ్రైవింగ్ చేసే డ్రైవర్ లైసెన్సు.. తదితర నిబంధనలను పాఠశాలల యాజమాన్యం తుంగలో తుక్కుతున్నారు. విద్యా సంస్థలు తెరుచుకోవడంతో ఆర్టీఏ అధికారులు ప్రత్యేక డ్రైవ్‌లు చేపట్టారు. బస్సులను తనిఖీ చేస్తూ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న బస్సులను సీజ్ చేస్తున్నట్టు అధికారులు చెప్పారు.